'అధికారంలోకి వస్తాం..మీ భూముల్ని తిరిగి ఇప్పిస్తాం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతుల బాధలు, సమస్యలు, వారిపై వేధింపులు.. వింటుంటే గుండె తరుక్కుపోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని...వారి తరపున పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత రైతులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. కాగా రాజధాని గ్రామాల్లో పోలీసుల దుశ్చర్య, వేధింపులపై ...రైతులు సోమవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ను కలిశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెలిబుచ్చారు.
అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతులు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోవటంలో తప్పులేదని, అయితే ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. రోడ్లు వేసి, జోనింగ్ చేసి వదిలేయాల్సిన ప్రభుత్వం..భూములు ఎందుకు లాక్కోవాలని చూస్తోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పాలన చేయాలే కానీ...రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని వైఎస్ జగన్ అన్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని, ఆ అధికారం ఉండేది నాలుగేళ్లే... ఇంకా ముందే పోవచ్చు అని వైఎస్ జగన్ అన్నారు. 'మీ అన్నా...తమ్ముడో, కొడుకో అధికారంలోకి వస్తాడు...తిరిగి మీ భూముల్ని మీకు ఇస్తాడ'ని పేర్కొన్నారు. బలవంతంగా భూమి లాక్కునే ప్రయత్నం చేస్తే కోర్టులు ఉన్నాయని, అక్కడ సవాల్ చేద్దామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం రైతులతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలవనున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. వారి సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళతామన్నారు.