చొక్కా పట్టుకు లాక్కెళ్లారు...
హైదరాబాద్ : భూములు ఇవ్వని రైతులపై తీవ్రమైన ఒత్తిడులు వస్తున్నాయని ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో పోలీసుల దుశ్చర్య, వేధింపులపై ...రైతులు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెలిబుచ్చారు.
ఊర్లలో పోలీసులు తిరగడం విపరీతమైందని, ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉందన్నారు. పంటలు పండే భూములను రాజధాని కోసం ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. తమకు ఉండే అర ఎకరం పొలంలో పంటలు పండించి జీవనం సాగించే తమ దగ్గర భూములను లాక్కోవటం సరికాదన్నారు. తాము భూములు ఇచ్చేది లేదని రాజధాని ప్రాంత రైతులు తెగేసి చెప్పారు.
ఉండవల్లికి చెందిన సాంబిరెడ్డి అనే రైతు మాట్లాడుతూ తమ పంటలను దుండగులు తగలబెడితే...దాన్ని కూడా వ్యవసాయ మంత్రి ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆపాదించారన్నారు. కనీసం గ్రామంలో అడుగు పెట్టకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని ఎలా చెబుతారని ప్రశ్నించినందుకు తనపై కక్ష కట్టారన్నారు. మంత్రిని అడ్డుకున్నందుకు ...ఇంటి బయట అరుగుమీద కూర్చున్న తనను చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కెళ్లారని సాంబిరెడ్డి తెలిపాడు. మంత్రిని అడ్డుకుని, ప్రశ్నించినందుకే వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.
మంగళగిరికి చెందిన మరో మహిళా రైతు ఉషారాణి మాట్లాడుతూ తమ భూముల్ని ఇచ్చేస్తే ఎలా బతికేదని...ప్రశ్నిస్తున్నందుకు తమ కుటుంబసభ్యుల్ని పోలీసులు తీసుకు వెళ్లి వేధిస్తున్నారని, తమవారిని విడుదల చేయాలని ధర్నా చేస్తే.. అప్పుడు విడుదల చేస్తున్నారని తెలిపారు. తాము చేసిన తప్పేంటి అని ఆమె ప్రశ్నించారు.