సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పని చేస్తుందని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి జేకే ద్వివేది స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ...‘ఈ ఏడాది జనవరి 11వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా తొలగించలేదు. ఫామ్-7 దరఖాస్తు మాత్రమే. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదు. నకిలీ దరఖాస్తులపై పోలీసుల కేసులు ప్రారంభం కాగానే దరఖాస్తులు ఆగిపోయాయి.
ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీల వైఖరి సరికాదు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదు. పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫామ్-7పై అభ్యంతరాలు చెబుతున్నారు. బయటకు వెళ్లి ఓట్లు తొలగిస్తున్నారని చెబుతున్నారు. ఎక్కడ ఓట్లు తొలగించారో విమర్శించేవారు నిరూపించాలి. ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉంది. 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువమందికి ఓటు హక్కు లేదని గుర్తించాం. ఎన్నికల సంఘంపై అనుమానపడాల్సిన అవసరం లేదు.’ అని అన్నారు. ఈ సందర్భంగా ఫామ్-7పై ఏపీ సీఈవో ద్వివేది స్పష్టత ఇచ్చారు.
- ఫామ్-7 ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగించం
- ఫామ్-7 దరఖాస్తులు ఇవ్వడం తప్పు కాదు
- ఫామ్-7 ఇచ్చిన దరఖాస్తులన్ని విచారిస్తాం
- ఫామ్-7 ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగించం
- ఇప్పటివరకు 10 వేల ఓట్లు మాత్రమే తొలగించాం
- ఫామ్-7 దరఖాస్తుల్లో 40 వేల ఓట్లను మాత్రమే తొలగించేందుకు అనుమతి ఇచ్చాం
- ఫామ్-7 దరఖాస్తులు ఎన్ని ఇచ్చినా నష్టం లేదు
- తప్పుడు ఫిర్యాదులుపై కేసులు నమోదు చేయగానే దరఖాస్తులు తగ్గిపోయాయి
కాగా 8లక్షల టీడీపీ ఓట్లు తొలగించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓట్ల తొలగింపు కోసం ఫామ్-7ను ఉపయోగించారని, ’చూస్తుంటే రేపు నా ఓటు కూడా తొలగిస్తారేమో'నని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment