
పనికిరాని శాఖలను పీకేస్తా: చంద్రబాబు
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాక్షి, అమరావతి : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలేని శాఖలను మూసేస్తామని, వాటి స్థానంలో కొత్త శాఖలను ఏర్పాటు చేస్తామని అన్నారు. బుధవారం విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...‘టెక్నాలజీ అనుగుణంగా కొత్త శాఖలను సృష్టించాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖల్లో పాతతరం చట్టాలు ఉన్నాయి. ఉద్యోగులు, అధికారులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి. ఎన్ని గంటలు ఉద్యోగులు ఆఫీసులో ఉంటున్నారో నమోదు కావాల్సిందే’ అని అన్నారు.
తన పాలనలో 58శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దేశంలో వృద్ధిరేటు పడిపోయిందని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెరుగుతోందని ఆయన అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 11.72 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ‘ఏపీ గ్రోత్ రేటు 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కలెక్టర్ల సదస్సులో సీఎం... ‘పీపుల్ ఫస్ట్’ యాప్‌ను ఆవిష్కరించారు. 1100 నెంబర్‌కు ఫోన్‌చేసి ప్రభుత్వ సేవలు, పథకాల అమలుపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.