
సాక్షి, అమరావతి : రికార్డు సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన యజ్ఞాన్ని పూర్తి చేశామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన 14 రకాల పరీక్షల ఫలితాలను గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పరీక్షల ఫలితాల సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షలను పూర్తి పారదర్శకతతో రికార్డు సమయంలో నిర్వహించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు.
ఎన్నికల హామీలో చెప్పినట్టుగానే పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా 1,26,728 శాశ్వత ఉద్యోగాలను కల్పించడం చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. పరీక్షల్లో విజయం సాధించిన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. వీరికి మంచి శిక్షణ ఇస్తామని, వీరంతా ప్రజా సేవలో మమేకం కావాలన్నారు. అవినీతికి దూరంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులను కూడా ప్రశంసించారు. అంకిత భావంతో పరీక్షలు నిర్వహించారని కొనియాడారు. అక్టోబరు 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని, పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు అవి నాంది పలుకుతాయని సీఎం అన్నారు. వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రజల ముంగిటకే అందుతాయన్నారు.