ఏపీ: లక్ష కిట్లు వచ్చాయ్‌ | AP CM YS Jaganmohan Reddy Tests Negative for COVID-19 | Sakshi
Sakshi News home page

లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు వచ్చాయ్‌

Published Sat, Apr 18 2020 2:53 AM | Last Updated on Sat, Apr 18 2020 8:11 AM

AP CM YS Jaganmohan Reddy Tests Negative for COVID-19 - Sakshi

కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం..ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం వాడనున్నారు. ప్రత్యేకంగా చార్టర్డ్‌ విమానంలో దక్షిణ కొరియాలోని సియోల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెప్పించింది. ముందుగా లక్ష కిట్లు అందించామని.. త్వరలో మరో 9 లక్షల కిట్లను అందజేస్తామని ఎస్‌డీ బయో సెన్సార్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

10 నిమిషాల్లోనే.. ర్యాపిడ్‌ కిట్లలో ఐజీజీ, ఐజీఎం అనే రెండు రకాల స్ట్రిప్స్‌ ఉంటాయి. కేవలం బ్లడ్‌ డ్రాప్స్‌ను ఈ స్ట్రిప్స్‌పై వేస్తారు. తర్వాత కంట్రోల్‌ సొల్యూషన్‌ వేస్తారు. 10 నిమిషాల వ్యవధిలో వైరస్‌ ఉన్నదీ, లేనిదీ చూపిస్తుంది.

సాక్షి, అమరావతి: కోవిడ్‌– 19 నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ కిట్లను ప్రారంభించారు. శాండర్‌ మెడికెయిడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సింథీ, డైరెక్టర్‌ మురళీధర్‌.. ఈ కిట్లను సీఎం జగన్‌కు అందజేశారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ కోవిడ్‌–19 నివారణా చర్యలపై సమీక్షించారు. తాజాగా వచ్చిన ర్యాపిడ్‌ కిట్ల ద్వారా రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఊపందుకుంటాయన్నారు. వీటి వినియోగంపై వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నాలుగు రోజుల్లో ఈ కిట్లు జిల్లాలకు చేరుతాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి సీఎంకు వివరించారు. 

10 లక్షల టెస్టు కిట్లకు ఆర్డర్‌
► దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయో సెన్సార్‌ కంపెనీ వీటిని ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఈ కిట్లకు ఐసీఎంఆర్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. 
► రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల టెస్టు కిట్లను ఆర్డర్‌ చేసిందని, రానున్న రోజుల్లో వీటిని అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. సాంకేతిక పరమైన సహకారాన్ని కూడా ప్రభుత్వానికి అందిస్తున్నామన్నారు. 
కరోనా వైరస్‌ పరిస్థితులకు ముందు రాష్ట్రంలో ఒకే ఒక్క వైరాలజీ ల్యాబ్‌ ఉండేది. కేవలం ఈ ల్యాబ్‌ ద్వారా మాత్రమే టెస్టులు చేయించేవారు. కోవిడ్‌–19 నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 
► కేవలం 2 వారాల వ్యవధిలో విజయవాడ, కాకినాడ, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖపట్నంలలో ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ ల్యాబ్‌ల ద్వారా రోజూ 2,100 పైగా టెస్టులను చేస్తున్నారు. 
క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌–19 కిట్లను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని తదితరులు   

ట్రూనాట్‌ కిట్లతోనూ కొనసాగనున్న పరీక్షలు
► ఇవికాక రాష్ట్రంలో విస్తృతంగా ట్రూనాట్‌ కిట్లు ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ట్రానాట్‌ కిట్లు మన దగ్గర ఉన్నాయని అధికారులు తెలిపారు. సుమారు 240కి పైగా కిట్లను ఉపయోగించుకోవడం వల్ల పరీక్షల సామర్థ్యం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. అందువల్లే ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల వినియోగానికి ముందే దేశంలో జానాభా ప్రాతిపదికన అత్యధిక కోవిడ్‌– 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా నిలిచింది. 
► 16వ తేదీ వరకు రాష్ట్రంలో 16,555 టెస్టులు చేశారు. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 331 పరీక్షలు చేశారు. రెండు మూడు రాష్ట్రాలు మినహాయించి ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించ లేదు. 
► ర్యాపిడ్‌ టెస్టు కిట్లతో పరీక్షలు మరింత ఊపందుకుంటాయని, త్వరలో దేశంలోనే తొలి రెండు మూడు స్థానాల్లో నిలుస్తామని అధికారులు చెప్పారు.
► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌ పాల్గొన్నారు. 

కమ్యూనిటీ టెస్టింగ్‌ అంటే..
విదేశాల నుంచి వచ్చిన వారు.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్, ఢిల్లీ సదస్సులో పాల్గొని వచ్చిన వారు.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ కాకుండా ఇతరులకు కరోనా పరీక్షలు నిర్వహించడాన్ని కమ్యూనిటీ టెస్టింగ్‌ అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ ఎలా సోకిందో తెలియదు. మార్కెట్‌కు వెళ్లినప్పుడో లేక వీధిలో వాళ్లను ఎవరినైనా తాకినప్పుడో వైరస్‌ సోకిందనుకుందాం. ఇలాంటప్పుడు ఈ వ్యక్తి ఇంటి చుట్టుపక్కల వారికి, ఆ వీధిలో వారికి, హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో, రెడ్, ఆరెంజ్‌ జోన్లలో కమ్యూనిటీ టెస్ట్‌లు చేపట్టనున్నారు. 

ఎలా చేస్తారంటే..
రెండు రకాలుగా (వ్యక్తిగతంగా, ర్యాండమ్‌గా) కమ్యూనిటీ టెస్ట్‌ చేయనున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వ్యక్తిగతంగా చేస్తారు. వైరస్‌ సోకిన వ్యక్తి ఇంటి చుట్టుపక్కల వారందరిలో ఐదుగురు చొప్పున తీసుకుని (వారందరి రక్తంతో కామన్‌గా) ర్యాండమ్‌గా టెస్ట్‌ చేస్తారు. పాజిటివ్‌ వస్తే ఆ ఐదుగురికీ విడి విడిగా టెస్ట్‌లు చేస్తారు. ర్యాండమ్‌ పద్ధతి వల్ల కిట్‌లను పొదుపుగా వాడుకోవచ్చు.  

కోవిడ్‌–19 టెస్ట్‌ చేయించుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌–19 పరీక్ష చేయించుకున్నారు. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా వైద్యులు ఆయనకు పరీక్ష చేసి, నెగిటివ్‌గా నిర్ధారించారు. కోవిడ్‌–19 కంట్రోల్‌ సెంటర్‌లో స్టేట్‌ కో–ఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్‌ రాంబాబు ముఖ్యమంత్రికి పరీక్ష నిర్వహించారు. శుక్రవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్‌ విమానంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. ఈ కిట్‌ ద్వారానే సీఎంకు వైద్యులు పరీక్ష నిర్వహించారు. కోవిడ్‌–19 పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలెవ్వరూ సంకోచం చెందొద్దని, నిరభ్యంతరంగా, ఎలాంటి సందేహం లేకుండా టెస్టులు చేయించుకోవాలనే సందేశం ఇవ్వడానికే ముఖ్యమంత్రి పరీక్ష చేయించుకున్నారని డాక్టర్‌ కె.రాంబాబు తెలిపారు. ఈ కిట్ల ద్వారా కంటైన్‌మెంట్‌ జోన్లలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడిందని ఆయన వివరించారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్‌గా తేలినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కోవిడ్‌ ఆసుపత్రులు, క్వారంటైన్లలో  మంచి వైద్య సదుపాయాలు, వసతులు ఉన్నాయని చెప్పారు. మంచి ఆహారం తీసుకుంటూ చికిత్స పొందితే త్వరలో ఆరోగ్యవంతులవుతారన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement