
సాక్షి, అమరావతి : కరోనావైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎంఓ అడిషినల్ సీఎస్ పీవీ రమేష్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏపీకి ఉందని, వారంతా ఇంటింటికి వెళ్లి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో కరోనా నియంత్రణకు ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నామని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను పెంచుతామన్నారు. నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని, మెడికల్ స్టోర్స్ సహా అన్నింటిని మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య, పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో సహా ప్రభుత్వ ముఖ్యమైన శాఖలు అన్ని కష్టపడి పనిచేస్తున్నారని, ప్రజలు కూడా సహకరించాని కోరారు.