
సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు ఏపీలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ సీఎంవో అడిషనల్ సీఎస్ పీవీ రమేష్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 220 మందికి వైద్య పరీక్షలు చేశామని.. 168 రిపోర్టులు నెగిటివ్ వచ్చాయన్నారు. మిగిలిన రిపోర్టులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి రోజు రెండు సార్లు సమీక్ష చేస్తున్నారని వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యలను పరిశీలించేందుకు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో నియంత్రణ చర్యలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. (‘లాక్‌డౌన్ ఉల్లంఘనులను ఉపేక్షించొద్దు’)
లాక్‌డౌన్‌కు ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని పీవీ రమేష్ కోరారు. సామాజిక బాధ్యతతో స్వీయ నియంత్రణ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అనవసరంగా రోడ్లపై తిరగడంతో మీ వల్ల వైరస్ వ్యాపించే అవకాశముందన్నారు కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే 104కు కాల్ చేయాలని తెలిపారు. శుభ్రత పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చన్నారు. ప్రతి గంటకోసారి చేతులు కడుక్కోవాలని ఆయన సూచించారు. నిత్యావసరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిత్యావసరాలకు ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని.. ప్రజలెవరూ గుంపులుగా రావొద్దని పీవీ రమేష్ విజ్ఞప్తి చేశారు.
(భారీ ఊరట : త్వరలో మహమ్మారి తగ్గుముఖం)