ఓఎస్డీయా మజాకా!
‘మంత్రుల వద్ద నా హవా ఎంటో చూస్తారా..!’-అంటూ ఆ అధికారి తన మిత్రబృందంతో జరిపే విందుల్లో చెప్పి మరీ డాబు ప్రదర్శిస్తున్నారు. ఏపీ సీఎం కార్యాలయంలోని ప్రత్యేకాధికారి(ఓఎస్డీ) ఒకరు ఈ మధ్య రాత్రిపూట సమయం సందర్భం లేకుండా మంత్రులకు ఫోన్లు చేసి సతాయిస్తున్న వైనం ఇప్పుడు మంత్రుల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడని, అందులోనూ ఆయన కుమారుడికి మరింత సన్నిహితుడిగా పేరు పడిన ఆ అధికారి ఇటీవలి కాలంలో తన మొబైల్‌లో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మిత్రుల ముందు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదట!
రాత్రిపూట తన మిత్ర బృందంతో విందు సమావేశాల్లో పాల్గొనే సమయంలో తన సెల్‌ఫోన్ నుంచి తనకు తోచిన ఎవరో ఒక మంత్రికి ఫోన్ చే స్తున్నారట. అలా ఫోన్‌చేసి తనకు కావాల్సిన వివరాలు.. లేదా చేయాల్సిన పనుల గురించి చెబుతున్నారు. మిత్ర బృందం ముందు దర్పం ప్రదర్శించుకునేందుకు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మరీ మాట్లాడుతున్నారట. అవత లి నుంచి ఈ ఓఎస్‌డీ గారు ఫోన్ చేసిన మంత్రి.. నమస్కారం పెట్టగానే ఈయన కూడా నమస్కారం పెట్టి ఫలానా విషయం ఏమైంది అని ఒక్క మాట అలా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడి ఇలా ఫోన్ కట్టేస్తున్నారట.
ఫోన్ చేసింది సీఎం కార్యాలయ ఓఎస్డీ కావడంతో అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ఫోన్లు ఎత్తి మంత్రులు సమాధానం ఇస్తున్నారట. ఫోన్ చేసిన ఓఎస్‌డీగారేమో తన హవా ఎలా నడుస్తుందో, మంత్రులు తన ఫోన్ అంటే ఎలా అర్ధరాత్రి పూట కూడా అటెన్షన్‌లో నిలబడి సమాధానం ఇస్తారో మిత్రులకు సవివరంగా చెబుతూ దర్పం ఒలకబోస్తున్నారట. ఈ విషయం మంత్రులకు తెలిసినా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట!