
‘హోదాతోనే అభివృద్ధి ముడిపడి ఉంది’
హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు చేస్తే ఆదాయం తగ్గిపోతుందనే వాదన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మద్యపాన నిషేదం అమలు చేస్తున్న గుజరాత్, బిహార్ లాంటి రాష్ట్రాలు నిజమైన అభివృద్ధి చెందుతున్నాయన్న విజయ సాయిరెడ్డి... ఏపీలో అభివృద్ధి కేవలం పేపర్ల వరకే పరిమితమైందన్నారు.
ఈ నెల ఆరో తేదీన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షణ నిమిత్తం పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఇవాళ విశాఖ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6న జరిగే జై ఆంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. హోదా వస్తే వేలసంఖ్యలో ఫ్యాక్టరీలు వచ్చి లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.