పైసా.. పైరవీ.. బదిలీ | AP employee transfers date extended to november 22 | Sakshi
Sakshi News home page

పైసా.. పైరవీ.. బదిలీ

Published Sun, Nov 16 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

పైసా.. పైరవీ.. బదిలీ

పైసా.. పైరవీ.. బదిలీ

* నిబంధనలకు పాతర...
* ఆమ్యామ్యాలు, అమాత్యుల అవసరాలే ఏకైక ప్రాతిపదిక
* భారీగా ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు
* ప్రాంతం, పోస్టు ఆధారంగా బదిలీలకు ముడుపుల రేట్లు
* బదిలీ కోరుతున్న వారితో కిటకిటలాడుతున్న సచివాలయం
* ఈ నెల 22 వరకు బదిలీల గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు
* సింగపూర్ నుంచి రాగానే సీఎం తీసుకున్న తొలి నిర్ణయం

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బదిలీల జాతర ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్ర సచివాలయం బదిలీ కోరుకుంటున్న వారితో పైరవీకారులతో కిటకిటలాడుతోంది. సీనియారిటీని పట్టించుకోరు.. సర్వీసునూ లెక్కలోకి తీసుకోరు.. అనారోగ్యమా కాదా అనేదీ పరిగణించరు.. ఖాళీలు ఉన్నాయా అనేదీ అవసరం లేదు.. ‘ముడుపులు ముట్టాయా? లేదా?’ అన్నదే ఏకైక ప్రాతిపదికగా ఈ బదిలీల పర్వం సాగుతోందని అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. ‘నీడ్ బేస్‌డ్’ (అవసరం ప్రాతిపదికగా) అనే పేరుతో జరుగుతున్న బదిలీల్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నాయన్నది సచివాలయంలో గుప్పుమంది.
 
కీలకమైన పోస్టుల బదిలీల విషయంలో భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పినట్లు అధికారవర్గాల్లో వినిపిస్తోంది. కొందరు అధికారులను తాము సూచించిన చోటికే బదిలీ చేయించుకోవడానికి మంత్రులు పట్టుబట్టి మరీ పని చేయించుకున్నారు. గత మూడు రోజులుగా సచివాలయంలో సాగుతున్న ఈ బదిలీ వ్యవహారాలు పలువురు మంత్రుల మధ్య చిచ్చుకు కూడా కారణమైంది. వాస్తవానికి ఈ బదిలీల ప్రక్రియ శనివారంతో ముగియాల్సి ఉండగా.. బదిలీల కోసం సచివాలయం కిటకిటలాడటంతో ఆ గడువును ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించటం విశేషం.
 
పైరవీకారుల అవసరాలే ప్రాతిపదికగా...
ఉద్యోగుల బదిలీలకు గతంలో చెప్పిన కౌన్సెలింగ్ విధానానికి పాతరేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఈ బదిలీలు వద్దని కిందిస్థాయి ఉద్యోగులు మొత్తుకున్నా ససేమిరా అన్న సర్కారు కొత్తగా నీడ్ బేస్‌డ్ పేరుతో అమాత్యుల అవసరాలు తీర్చుతున్నారన్న విమర్శలు సర్వ త్రా వినిపిస్తున్నాయి. బదిలీలకు ఒక విధానం లేకుండా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం, వారి అవసరాల మేరకు బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది.
 
 ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలకు కౌన్సిలింగ్ విధానం తీసుకువచ్చానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ విధానానికి తిలోదకాలు ఇచ్చేశారు. సాధారణంగా అయితే  ఖాళీలున్నా, లేదా భార్య-భర్తల కేసులో, లేదా ఆరోగ్య సమస్యల కేసుల్లో లేదా మూడేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. అయితే ఇప్పుడు అటువంటి విధివిధానాలేమీ లేకుండా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పైరవీరీకారుల ‘అవసరాల’ కోసం బదిలీలు సాగుతున్నాయి.
 
 చిచ్చురేపిన విశాఖ ఆర్‌డీఓ బదిలీ..
 ఈ క్రమంలోనే విశాఖపట్నానికి చెందిన ఒక ఉన్నతాధికారి బదిలీ విషయంలో ఇద్దరు మం త్రుల మధ్య వివాదం తలెత్తింది. విశాఖపట్నం ఆర్‌డీఓగా ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి ఆ పోస్టులోకి వచ్చేందుకు.. గత ప్రభుత్వంలోను, ప్రస్తుత ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్న వ్యక్తికి, మరో ఎమ్మెల్యేకు నాడు 70 లక్షల రూపాయల వరకు ముట్టచెప్పినట్లు అధికార వర్గాల సమాచారం. ఇప్పుడు ఆ వ్యక్తిని బదిలీ చేసి మరో వ్యక్తి నియామకానికి సదరు మంత్రి వ్యతిరేకించడమే కాకుండా.. సహచర మంత్రి అయ్యన్నపాత్రుడుపై దుష్ర్పచారానికీ దిగారని, ముఖ్యమంత్రికి సైతం తప్పుడు సమాచారం ఇచ్చారని అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
 
 బుగ్గ కారుల్లో పైరవీకారుల షికార్లు...
 సచివాలయంలో గత నాలుగు రోజులుగా బది లీల కోసం సాగుతున్న పైరవీలను, సచివాల యం జనంతో కిటకిటలాడుతున్న తీరును చూసి ఉన్నతస్థాయి వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా అయితే సచివాలయంలోకి మూడు గంటల తర్వాత సందర్శకులను అనుమతిస్తారు. అయితే మంత్రులు తాము వినియోగించే బుగ్గ కారులను బయటకు పంపించి మరీ సచివాలయంలోకి బదిలీలు కోరుతున్న పైరవీకారులను తీసుకువస్తున్నారు. దీంతో ఉదయం నుంచే సచివాలయం బదిలీల జనంతో నిండిపోతోంది. ‘సాధారణంగా ఎన్నికల ముందు సంవత్సరం ఇలాంటి బదిలీలు తీరు చూశాం గానీ.. మా వాళ్లు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటకముందే ఉత్సాహం చూపిస్తున్నారు’ అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.
 
 గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు...
 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ నుంచి తిరిగి హైదరాబాద్ రాగానే తీసుకున్న తొలి నిర్ణయం అవసరాల బదిలీలను మరో వారం రోజుల పాటు పొడిగించడమే. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీ వరకు నీడ్ బేస్‌డ్ బదిలీలను పొడిగిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం శనివారం ఉత్తర్వులు జారీచేశారు.  
 
 కోరుకున్న పోస్టింగ్ కావాలంటే ‘చెన్నై’ వెళ్లి రావాలి...
 ఇక.. ఆర్‌డీఓ, మునిసిపల్ కమిషనర్లు, డీఈఓల బదిలీలకు పోస్టింగ్ ప్రాంతం ఆధారంగా రేటు పలుకుతున్నట్లు సచివాలయం వర్గాలు కోడై కూస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పోస్టింగ్ కోసం భారీ ముడుపులు డిమాండ్ చేస్తున్నారని రెండు రోజులుగా సచివాలయంలో చక్కర్లు కొడుతున్న ఒక డీఈఓ ఆవేదన వ్యక్తంచేశారు. రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టుకు రూ. 30 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని జిల్లాల నుంచి బదిలీల కోసం సచివాలయం వచ్చిన ఉద్యోగులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కోరుకున్న చోటకు పోస్టింగ్ కావాలంటే చెన్నై వెళ్లి తాము చెప్పిన వ్యక్తిని కలిసి రావాలని ఒక మంత్రి కార్యాలయ సిబ్బందే బహిరంగంగా చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement