ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : చంద్రబాబునాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలకు కట్టుబడి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న జిల్లా, డివిజన్ మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నట్టు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటం నాగభూషణరావు చెప్పారు. ఏలూరులోని యూనియన్ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన వామపక్ష పార్టీల నాయకుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలో పది వామపక్ష పార్టీలు సెప్టెంబర్ 29 నుంచి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించాయన్నారు. దీనిలో భాగంగా 13న ఏలూరులో కలెక్టరేట్, నర్సాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో తహసిల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని నాయకులకు సూచించారు. సమావేశంలో చేగువీరా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. సీపీఎం జిల్లా నాయకులు జీవీఎల్ నరసింహారావు, కనకం రామ్మోహనరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.పొలారి, యు.వెంకటేశ్వరరావు, బి.వెంకట్రావు, సీపీఐ నాయకులు ఎస్.నాగరాజు, పి.అప్పలరాజు పాల్గొన్నారు.
రుణమాఫీ అమలు కోరుతూ 13న ధర్నాలు
Published Fri, Oct 10 2014 1:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement