రుణమాఫీ ఎండమావేనా! | Chandrababu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీ ఎండమావేనా!

Published Tue, Jun 10 2014 12:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రుణమాఫీ ఎండమావేనా! - Sakshi

రుణమాఫీ ఎండమావేనా!

 సాక్షి, ఏలూరు/కొవ్వూరు : రుణమాఫీపై తొలి సంతకం చేశానని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయు డు చెబుతున్న మాటలు జిల్లా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తొలి సంతకం రుణమాఫీ ఫైలుపై పెట్టినట్లు చెబుతూ కేవలం కమిటీని మాత్రమే ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ఇచ్చే నివేదిక కోసం 45 రోజులు గడువు విధించడంతో రుణమాఫీ అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. రుణమాఫీ కాకపోతే ఖరీఫ్ సాగు చేయలేమని.. లేదంటే పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
 
 జిల్లాలో బకాయిలు రూ.11,848.85 కోట్లుజిల్లాలో దాదాపు 14,55,030 అకౌంట్స్ ద్వారా దాదాపు రూ.11,848.85 కోట్లను పంట రుణాలుగా తీసుకున్న అన్నదాతలు అవి మాఫీ  అయ్యే రోజుకోసం ఎదురుచూస్తున్నారు. గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తే తప్ప కొత్త రుణాలు మంజూరు చేయమని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 3,24,749  హెక్టార్లలో ఖరీఫ్  సాగు పెట్టుబడికి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించక తప్పదు. అలా చేయడం వల్ల రైతులపై ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, వరుస ఉపద్రవాలకు పంటలు నష్టపోయి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. 45 రోజుల తరువాత వచ్చే నివేదిక ఎలాంటి పరిష్కారం చూపుతుందో తెలియదు. నివేధికపై ప్రభుత్వం ఎంత సమయంలో నిర్ణయం తీసుకుంటుందనే దానిపై స్పష్టత లేదు. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడిలా కమిటీలంటూ కాలయాపన చేయడం పద్ధతి కాదని, వెంటనే రుణమాఫీ చేసి మాట నిలుపుకోకపోతే తమ ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
 
 కౌలు రైతుల సంగతేంటి!
 రుణమాఫీ పథకం తమకు వర్తిస్తుందో లేదోననే ఆందోళన కౌలు రైతులను వెంటాడుతోంది. రుణార్హత కార్డులు తీసుకున్న రైతులు నేరుగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగా.. కార్డులు లేని కౌలు రైతులు భూమి యజమానుల పేరిట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ పథకం మార్గదర్శకాలు నిర్దేశించేందుకు నియమించిన కమిటీ కౌలు రైతులను పరిగణనలోకి తీసుకుంటుందో లేదోనన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కౌలు రైతులు అగమ్యగోచరంలో కొట్టుమిట్టాడుతున్నారు.
 
 కౌలు రైతులకూ వర్తింపచేయూలి
 ఏటా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఎక్కువగా నష్టపోతున్నది కౌలు రైతులే. వారికి రుణమాఫీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి ఆదుకోవాలి. రైతు మిత్ర గ్రూపుల ద్వారా పొందిన రుణాలు, రుణార్హత కార్డుల ద్వారా రుణాలు పొందిన కౌలు రైతులకూ రుణమాఫీ వర్తింపచేయూలి.   
 - డి.అశోక్‌కుమార్,

 మండల కార్యదర్శి, కౌలు రైతుల సంఘం
 పెట్టుబడికి సొమ్ము లేదు
 ఖరీష్ సాగులో పెట్టుబడులకు సొమ్ములు లేవు. ఎన్నికల ముందు రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణాలు మాఫీ చేయకుండా కమిటీని అంటూ కాలయాపన చేస్తున్నారు. దీనివల్ల బ్యాంకుల నుంచి కొత్త రుణాలు కూడా తీసుకోవడానికి వీలు పడడం లేదు.
 - కొఠారు బుజ్జియ్య, రైతు, చాగల్లు
 
 తొలి సంతకం బూటకం
 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తొలి సంతకం బూటకంలా అనిపిస్తోంది.  విధివిధానాలు అంటూ కమిటీ వేయడం రైతుల్లో అనుమానాలకు తావిస్తోంది. తక్షణం రుణమాఫీ చేయూలి. ఆ వెంటనే కొత్త రుణాలు మంజూరు చేయూలి. అలా చేస్తేనే రైతు మనుగడ సాగుతుంది.
 - గన్నాబత్తుల ఆంజనేయులు, రైతు, సారవ గ్రామం
 
 ప్రభుత్వం చొరవ చూపాలి
 టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతులు, కౌలు రైతులు తీసుకున్న రుణాలను వెంటనే మాఫీ చేయూలి. కాలువలకు నీరు విడుదల చేసే సమయం దగ్గరపడుతోంది. పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇస్తేనే పంటలు వేయగలం. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలి.
 - మిరియాల రామారావు, రైతు, కె.బేతపూడి
 
 వెంటనే అమలు చేయాలి
 రైతు రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. ఖరీఫ్ సీజన్ మొదలవుతోంది. పాత రుణాలు కట్టనిదే కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు అంటున్నారు. రుణమాఫీపై కాలయాపన చేయడానికే చంద్రబాబు కమిటీ వేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయంతో అన్ని విధాలా నష్టపోతున్నాం.
 - యర్రంశెట్టి రామకృష్ణారావు, రైతు, నామవరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement