పద్నాలుగు నెలలు క్షణమొక యుగంలా...  | AP Fishermens Says Thanks To CM YS Jagan | Sakshi
Sakshi News home page

పద్నాలుగు నెలలు క్షణమొక యుగంలా... 

Published Fri, Jan 10 2020 8:46 AM | Last Updated on Fri, Jan 10 2020 8:55 AM

AP Fishermens Says Thanks To CM YS Jagan - Sakshi

స్వగ్రామానికి రావడంతో తమవారిని చూసే ఆనందంలో గ్రామస్తులు

చిమ్మచీకటి... గురువారం తెల్లవారుజాము 3 గంటలు... భోగాపురం మండలం తీర ప్రాంతంలో ఉన్న తిప్పలవలస గ్రామం సందడిగానే ఉంది. పాక్‌లో బందీలుగా చిక్కి విడుదలై క్షేమంగా వస్తున్న తమవారిని చూసేందుకు వారంతా రాత్రి నిద్ర లేకుండానే ఎదురు చూశారు. 14 నెలలుగా దూరమైన వారు రానే వచ్చారు. అంతే... బంధువుల కళ్లల్లో ఆనందంతో కూడిన రోదనలతో గ్రామం మార్మోగింది. ఒకరినొకరు హత్తుకుంటూ ముద్దాడుకుంటూ ఇంటి వరకు తీసుకెళ్లారు.

సాక్షి, పూసపాటిరేగ: శత్రుదేశంలో చిక్కాం... పగలు ప్రతికారాలతో రగిలిపోతున్న దేశంలో బందీలుగా ఉన్నాం. దేవుడా జీవితం అంతేనా... అంటూ ఆశ చంపుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గెలిచారనే విషయం జైల్‌లో మగ్గుతున్న ఆంధ్రా మత్స్యకారులకు సమాచారం వచ్చింది. పాదయాత్రలో మత్స్యకారులను తప్పకుండా విడుదల చేస్తామని ఇచ్చిన హామీ గుర్తుకు వచ్చి ఎలాగైనా తాము విడుదల అవుతామనే నమ్మకం పెరిగింది. జైలులో ఉన్నా జీవితంపై మళ్లీ ఆశ చిగురించింది. ఇంతలోనే జనవరి 6వ తేదీన విడుదల చేస్తామంటూ పాక్‌ ఉన్నత అధికారులునుంచి వర్తమానం అందడంతో మత్స్యకారులలో ఆనందానికి అవధులు లేవు. మాట ఇచ్చినట్టే విడిపించి సొంత ఊళ్లకు తరలించిన ముఖ్యమంత్రికి కన్నీటితోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు.


పద్నాలుగు నెలల తరువాత విడుదల అయి స్వగ్రామం తిప్పలవలసలో బంధువులను కలుసుకున్నప్పుడు ఉద్విగ్న వాతావరణం
 
గురువారం వేకువజామున స్వగ్రామానికి 
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్‌ కృషి ఫలితంగా దాయాదులకు బందీలుగా మారిన మత్స్యకారులు ఎట్టకేలకు విడుదలై గురువారం వేకువజామున స్వగ్రామమైన తిప్పలవలస చేరుకున్నారు. అంతే అప్పటివరకూ వారికోసం కళ్లుకాయలు కాసేలా నిరీక్షించిన ఆ కుటుంబ సభ్యులు ఉది్వగ్నవాతావరణంలో వారిని ఆలింగనం చేసుకున్నారు.


కుమారుడు ధనరాజును ముద్దాడుతున్న పోలమ్మ

కొడుకు, భర్తను చూసిన ఆనందంలో నక్క పోలమ్మ, కుమారుడిని కలుసుకున్న ఆనందంలో తల్లి నక్కానర్సయ్యమ్మ ఇళ్లల్లో పండగ వాతావరణం నెలకొంది. 14 నెలలు పాక్‌ జైలులో దుర్బర జీవితం గడిపామని, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విదేశాంగ శాఖ ద్వారా విడుదలకు కృషి చేయడం వల్లనే శత్రుదేశం నుంచి బయటపడ్డామని వారంతా ఆనందబాష్పాలు రాల్చారు. 


క్షేమంగా ఇంటికి చేరినవారికి మిఠాయిలు తినిపిస్తున్న కుటుంబ సభ్యులు

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి వుంటాం 
జీవితం ఉన్నంత వరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి వుంటాం. హుద్‌హుద్‌ తుఫాన్‌లో నష్టపోవడంతో గుజరాత్‌లో బోటులో కూలీలుగా పనిచేసేందుకు వలస వెళ్లాం. అనుకోని పరిస్థితిలో పాకిస్తాన్‌ సముద్ర జలాల్లోకి వెళ్లి వారికి బందీలుగా చిక్కాం. పాక్‌ జైల్‌లోనే జీవితం ముగిసిపోతుందని అనుకున్నాం. విడుదలయ్యే అవకాశమే లేదని అనుకున్నాం. సీఎం చొరవతోనే మాకు మరో జన్మ కలిగినట్టయింది.         – నక్కా అప్పన్న, నక్కా ధనరాజు, తిప్పలవలస 

మా జీవితాల్లో వెలుగులు నింపారు.. 
పాకిస్తాన్‌ జైలునుంచి విడుదల చేయించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. 2018 నవంబర్‌ 27న పాక్‌ కోస్టుగార్డులకు చిక్కినప్పుడు ప్రాణం మీద ఆశపోయింది. ఆ తరువాత ఇండియాకు పాకిస్తాన్‌ మధ్య సరిహద్దు గొడవలతో యుద్ధ వాతావరణం నెలకొంది. బయటకు ఇక రాలేమని అనుకున్నాం. సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దయతో బయటపడ్డాం. బతికి వున్నంత కాలం ఆయన్ను మరవలేం. 
– నక్కా నరిసింగు, తిప్పలవలస  


పాకిస్తాన్‌ కష్టాలను బంధువులకు వివరిస్తున్న బర్రి బవిరీడు

చావు నుంచి బయటపడ్డాం
పాకిస్తాన్‌కు బందీలుగా చిక్కినప్పుడే ప్రాణం పోయిందనుకున్నాం. ఇప్పటివరకూ బందీలైనవారు బతికి బట్టకట్టిన దాఖలాల్లేవు. తప్పించుకుందాం అని సముద్రంలో వెళ్లిపోవడానికి ప్రయత్నించాం. పాకిస్తాన్‌ కోస్ట్‌గార్డులు గాలిలోకి కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. చేయి చేసుకున్నారు. కరాచీ జైల్‌లో వున్నప్పుడు నరకం చూశా. అక్కడ మట్టి తవ్వించడం, గడ్డి కోయించడంతో పాటు కష్టమైన పనులు చేయించేవారు. వాటి ద్వారా వచ్చిన డబ్బులతో ఆంధ్రా వంటలు చేసుకునే వాళ్లం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భిక్షతో జైల్‌ నుంచి బయటపడ్డాం. 
– బర్రి బవిరీడు, తిప్పలవలస 

చదవండి: సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: మత్స్యకారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement