సాక్షి, తాడేపల్లి : పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన రాష్ట్రానికి చెందిన 20 మంది మత్స్యకారులు సీఎం క్యాంపు ఆఫీస్‌లో బధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. ‘బతికినంత కాలం మీ పేరు చెప్పుకుంటాం’అని మత్స్యకారులు అన్నారు. ఈ సందర్భంగా దాయాది దేశంలో వారు పడిన కష్టాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం.. పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని వారిని ఆరా తీశారు.
కాగా, గుజరాత్ తీరం వెంబడి పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించిన 20 మంది ఆంధ్రా జాలర్లను పాకిస్తాన్ బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. 14 నెలలు పాక్ జైలులో ఉన్న మత్స్యకారులు సీఎం జగన్ చొరవతో సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. వాఘా బోర్డర్ వద్దకు వెళ్లిన ఏపీ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంటకరమణ విడుదలైన జాలర్లను రాష్ట్రానికి తీసుకొచ్చారు. సీఎం జగన్ మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో మంత్రి మోపిదేవి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.
10-15 వేల మంది గుజరాత్ వెళ్తాం..
‘పోర్టు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లాల్సి వస్తోంది. మాకు ఫిషింగ్ హార్బర్ నిర్మించి ఇస్తే ఇక్కడే కుటుంబాలతో కలిసి ఉంటాం. వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు. మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది. కానీ, 10–15వేల మంది గుజరాత్‌కు వెళ్లాల్సి వస్తోంది. జెట్టీలు, ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల మేమంతా గుజరాత్‌కు వలస వెళ్తున్నాం. పనిని బట్టే మాకు జీతాలు ఇస్తారు. మాకు మీరు నిజంగా ఊపిరి పోశారు. బతికినంత కాలం మీ పేరు చెప్పుకుంటాం. మీలో ఏదో కనిపించని శక్తి ఉంది. అందుకనే మేం బయటకు రాగలిగాం’అని మత్స్యకారులు ముఖ్యమంత్రితో అన్నారు.
మిగతావారిని విడిపించేందుకు కృషి..
మత్స్యకారులకోసం జట్టీలు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. భావనపాడు పోర్టు నిర్మాణంకోసం ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. మత్స్యకారులకోసం ప్రత్యేకంగా ఒక జెట్టీని కేటాయిస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు కోరిన విధంగా జెట్టీని కట్టిస్తామని హామినిచ్చారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేస్తున్నామని, ఉపాధికోసం వేరే ప్రాంతాలకు వలసవెళ్లకుండా ఈ ఆర్థికసాయం ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. అలాగే, పాకిస్తాన్ జైల్లో ఉన్న మిగిలిన ఇద్దరు మత్స్యకారులను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ జైల్లో ఉన్న 8 మంది మత్స్యకారులను విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మత్స్యకారుల జాబితా
1) వాసుపల్లి సామ్యుల్, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
2) కేశాం ఎర్రయ్య, శ్రీకాకుళం జ్లిలా ఎచ్చెర్ల మండలం
3) బాడి అప్పన్న, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం
4) నక్కా అప్పన్న, విజయనగరం జిల్లా పూసపాటిరేగ
5) నక్కా నర్సింగ్ (కొండ), విజయనగరం జిల్లా పూసపాటిరేగ
6) నక్కా ధనరాజ్, విజయనగరం జిల్లా పూసపాటిరేగ
7) బర్రి బవిరీడు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ
8) మైలపల్లి గురువులు, విజయనగరం జిల్లా భోగాపురం
9) సూరాడ అప్పారావు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
10) కొండా వెంకటేష్, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
11) దూడంగి సూర్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం
12) సూరాడ కళ్యాణ్, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
13) పెంచ మణి, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస
14) సూరాడ కిషోర్, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
15) కేశం రాజు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
16) గంగాళ్ల రామరావు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
17) చీకటి గురుమూర్తి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
18) మైలపల్లి రాంబాబు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
19) మైలపల్లి సన్యాసిరావు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
20) సకియా సమంత్, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల
Comments
Please login to add a commentAdd a comment