సాక్షి, విజయవాడ : లాక్‌డౌన్ కారణంగా సుమారు రెండు నెలల తరువాత రైళ్లు, విమానాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రైళ్ల ప్రయాణాలకు కేంద్రం అనుమతినివ్వడంతో ప్రభుత్వం మరింత అలర్ట్ అయ్యింది. ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కఠిన చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగానే ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, చెక్‌పోస్టుల వద్ద ఐ మాస్క్ స్వాబ్ టెస్టుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. వీటిని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మంగళవారం విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ‘విజయవాడలో దిగిన ప్రతి ప్రయాణికుడికి టెస్టులు నిర్వహించేందుకు టెక్నాలజీతో కూడిన వాహనాలను వినియోగిస్తున్నాం. ఈ వాహనంతో గంటకు 200 మందికి స్వాబ్ టెస్టులు చేయవచ్చు. ప్రయాణికుల సమయం వృధా కాకుండా ఉండేందుకు ఈ వాహనాలను వినియోగిస్తున్నాం. స్వాబ్ టెస్ట్ అనంతరం ఎవరి గమ్య స్ధానాలకు వారిని పంపిస్తాం. టెస్టుల సమయంలోనే కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తాం. ప్రతి ఒక్కరి డేటా మానిటిరింగ్‌లో ఉంటుంది. టెస్టుల్లో పాజిటివ్ వస్తే సంబంధిత జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించేలా వ్యవస్థను రూపొందించాం’ అని తెలిపారు. (‘జూన్ 8 నుంచి హరిత హోటల్స్ ప్రారంభం’)
ఇక దేశవ్యాప్తంగా సోమవారం 200 రైళ్లను పునఃప్రారంభిస్తుండటంతో రైల్వే శాఖ ప్రయాణికులకు హెల్త్ ప్రొటోకాల్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో 18 రైల్వే స్టేషన్లలోనే హెల్త్ ప్రోటోకాల్ అనుసరిస్తామని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. విజయవాడ మీదుగా 14 రైళ్లు నడపనున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment