పనులకు పచ్చజెండా  | AP government gave the green signal for Continuation of NABARD and CSS work | Sakshi
Sakshi News home page

పనులకు పచ్చజెండా 

Published Wed, Sep 25 2019 3:59 AM | Last Updated on Wed, Sep 25 2019 3:59 AM

AP government gave the green signal for Continuation of NABARD and CSS work - Sakshi

సాక్షి, అమరావతి: రూ.పది కోట్ల లోపు ఒప్పంద విలువ కలిగి ఇప్పటికే మొదలైన పనులన్నింటినీ కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పనులకు బిల్లులు చెల్లించేందుకు కూడా అనుమతిస్తూ ఆర్ధికశాఖ ఇటీవల మెమో జారీ చేసింది. ఈమేరకు బిల్లుల చెల్లింపు, పనులకు సంబంధించి ఈ ఏడాది మే 29వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ మెమో జారీ చేశారు.

ఒప్పందం కుదిరి, ప్రారంభం కాని రూ.పది కోట్ల లోపు విలువగల నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌) పనులను కూడా కొనసాగించాలని, ఇందుకు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సహాయ పునరావాస, భూసేకరణ బిల్లుల చెల్లింపునకు కూడా ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో రూ.పది కోట్ల లోపు విలువగల పనులన్నీ ప్రారంభం కానున్నాయి. తాగునీరు, రహదారులు, ఇతర అన్ని రకాల పనులు ఇందులో ఉన్నాయి. ఈ విషయంలో అన్ని శాఖలు ద్రవ్యజవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ సూచించింది. 

పురోగతి ఆధారంగా నిర్ణయం..
సంబంధిత శాఖలు పనుల పురోగతితోపాటు అగ్రిమెంట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని ఎంత పని పూర్తయిందనే అంశం ఆధారంగా పనులు కొనసాగించడమా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని మెమోలో ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 29 నాటికి చేసిన పనుల పురోగతి ఆధారంగా బిల్లుల చెల్లింపులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. సహాయ పునరావాస ప్యాకేజీ, భూసేకరణ విషయంలో బిల్లుల చెల్లింపునకు మిన హాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 

సమీక్షించనున్న మంత్రులు..
ఈ ఏడాది ఏప్రిల్‌ 1వతేదీ నాటికి విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు మినహా మిగిలిన పనులు మంజూరై ఉంటే ప్రారంభించని వాటిని రద్దు చేయాలని మెమోలో పేర్కొన్నారు. రూ.పది కోట్లకుపైగా విలువగల విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో మంజూరై ప్రారంభించని పనులపై సంబంధిత శాఖ మంత్రులు సమీక్షించాలి. విదేశీ, నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో రూ.పది కోట్లకు పైగా విలువగల పనులు ప్రారంభమై అగ్రిమెంట్‌ విలువలో 25 శాతం తక్కువ వ్యయం అయిన పనులను కూడా సంబంధిత శాఖల మంత్రులు సమీక్షించాలని ఆర్థిక శాఖ సూచించింది.

సమీక్ష  సమయంలో అంచనాల వ్యయ ప్రతిపాదనలు సక్రమంగా ఉన్నాయా? సింగిల్‌ బిడ్‌లు ఏమైనా దాఖలయ్యాయా? అంచనా వ్యయం కంటే ఎక్కువ మొత్తానికి టెండర్‌ కోట్‌ చేశారా? టెండర్లతో నిమిత్తం లేకుండా పనులేమైనా ఇచ్చారా? అనే అంశాలను పరిశీలించడంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పనుల అవసరం ఉందా? లేదా? అనేది పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అనంతరం అనుమతి కోసం ఆర్థికశాఖ మంత్రికి పంపాలని మెమోలో సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement