
సాక్షి, అమరావతి : ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలో రెన్యువల్ చేసుకోని 52 మద్యం దుకాణాలను తొలి విడతగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 13వ తేదీన అద్దె దుకాణాలు, ఫర్నీచర్, మద్యం డిపో నుంచి షాపులకు సరఫరా అంశాలపై వేర్వేరు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో ఖరారు చేశారు. 52 మద్యం దుకాణాలకు గాను 35 షాపులకు టెండర్లు ఖరారు కాగా.. మిగిలిన 17 షాపులకు దరఖాస్తులు రాకపోవడంతో వాటిని వాయిదా వేశారు. సర్కారు నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించి మిగిలిన వాటికి ఈ నెల 28న రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు టెండర్లు ఖారారు చేయబోతున్నారు.
జిల్లాలో మద్యం దుకాణాలు..
మద్యం పాలసీ ప్రకారం 2019 జూన్‌తో రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు గడువు ముగిసింది. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దీని కోసం విధి విధానాలను రూపొందిస్తోంది. కొత్త విధి విధానాలు వచ్చేంత వరకు గడువు ముగిసినా పాత మద్యం దుకాణాలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా దుకాణాల లైసెన్సులను 3 నెలలు పొడిగించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లాలో మొత్తం 346 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 171, మచిలీపట్నం ఈఎస్ పరిధిలో 175 షాపులు ఉన్నాయి.
రెన్యూవల్ చేయని దుకాణాలు 52
జిల్లాలో మొత్తం దుకాణాల్లో 294 దుకాణాలు రెన్యువల్ చేసుకోగా ఇంకా 52 దుకాణదారులు రెన్యువల్ చేసుకోలేదు. ఈ 52 దుకాణాలను మొదటి విడతలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో మచిలీపట్నం ఈఎస్ పరిధిలో ఖాళీలు ఉన్న దుకాణాలు 39 ఉండగా.. అందులో మచిలీపట్నం 4, అవనిగడ్డ 1, మొవ్వ 2, గుడివాడ 8, కైకలూరు 8, మండవల్లి 6, గన్నవరం 5, ఉయ్యూరు 5 ఉన్నాయి. విజయవాడ ఈఎస్ పరిధిలో 13 ఖాళీ దుకాణాలు ఉన్నాయి. పటమట 3, భవానీపురం 1, మైలవరం 2, నందిగామ 1, కంచికచర్ల 1, జగ్గయ్యపేట 3, తిరువూరు 2 దుకాణాలు ఉన్నాయి.
మొత్తం దుకాణాలకు ఈ నెల 28న టెండర్లు ఖరారు
ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 20 శాతం దుకాణాలను తగ్గించడానికి అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే 52 మద్యం షాపులను మినహాయిస్తే మిగిలిన 294 షాపుల్లో 20 శాతం అంటే 59 షాపులను రద్దు చేయబోతున్నారు. పోగా మిగిలిన 234 షాపులకు ఈ నెల 28న టెండర్లు ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
సితారా సెంటర్‌కు అత్యధికంగా రూ. 82 వేల అద్దె
రెన్యువల్ చేసుకోని 52 దుకాణాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. 52 దుకాణాలకు అద్దెకు ఇవ్వడానికి 47 మంది ముందుకు రాగా.. అందులో 17 షాపులకు దరఖాస్తులు రాలేదు. మచిలీపట్నంలో అత్యల్పంగా ఒక దుకాణానికి నెలకు 5,500 అద్దె ఖరారు కాగా.. అత్యధికంగా విజయవాడ నగరంలోని భవానీపురం సితారా సెంటర్‌లో దుకాణానికి నెలకు రూ. 82 వేలు అద్దె చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇదేవిధంగా ఫర్నీచర్, డిపోల నుంచి మద్యం సరఫరా టెండరుదారులతో అధికారులు బుధవారం రాత్రి వరకు సంప్రదింపులు జరిపి నిర్ణయించడం జరిగినట్లు సమాచారం. అక్టోబరు 1 నుంచి ఈ షాపుల ద్వారా ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment