భోగాపురం భూముల్లో...దూకుడు వద్దు
ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి భూములు సేకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసింది. హైకోర్టును ఆశ్రయించిన రైతులను, ఇతర వ్యక్తులను వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని హైకోర్టు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేగాక భూసేకరణపై రాతపూర్వక అభ్యంతరాలను సమర్పించే వెసులుబాటును రైతులకు కల్పించింది. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు ఏవైనా ఉత్తర్వులు జారీచేస్తే, ఆ ఉత్తర్వులు ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం కోసం పార్లమెంట్ ఆమోదం పొందని భూసేకరణ ఆర్డినెన్స్ 5/15 ప్రకారం తమ భూములను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ భోగాపురం మండలానికి చెందిన ఉప్పాడ సూర్యనారాయణ, దాట్ల వెంకట అప్పలప్రసాదరావు, మరో 200 మందికి పైగా రైతులు, పలువురు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక నోటిఫికేషన్‌ను రద్దుచేయాలని కోరుతూ వారు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ పుర్కర్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ నోటిఫికేషన్ జారీచేయడం సరికాదన్న పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, ఎ.సత్యప్రసాద్ చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి రాకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.