
ఆధార్ లింకు.. సంక్షేమం జంకు
సంక్షేమ పథకాలను ఆధార్ కార్డుతో ముడిపెట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలన్నిటికీ ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేయాలని
సాక్షి, ఏలూరు : సంక్షేమ పథకాలను ఆధార్ కార్డుతో ముడిపెట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలన్నిటికీ ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. గత యూపీఏ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు ఆధార్ లింకుపెట్టి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో ఎన్నికల ముందు తొలగించింది. తాజాగా ఇదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్దరిస్తోంది. రుణమాఫీ వర్తించాలన్నా.. విద్యుత్ సేవలు అందాలన్నా.. రేషన్ సరుకులు పొందాలన్నా.. చివరకు ఫీజులు.. స్కాలర్‌షిప్‌లు.. హాస్టల్ విద్యార్థులకూ ఆధార్ కార్డు కావాలంటున్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్ నంబర్ తప్పనిసరి చేయడంతో వాటి ఫలాలు అందక ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.
వీళ్ల పరిస్థితి ఏమిటో
జిల్లాలో 39లక్షల 69 వేల మంది ఆధార్ నమోదు చేయించుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకూ దాదాపు 36 లక్షల 26 వేల మందికి ఆధార్ కార్డులొచ్చాయి. వాటిలో సుమారు రెండు లక్షల కార్డుల్లో తప్పులు దొర్లినట్టు అధికారులు గుర్తిం చారు. ఇంకా 3.43 లక్షల మందికి ఆధార్ కార్డులు రాలేదు. వీరు సంక్షేమ పథకాలను పొందే అవకాశం కనిపించడం లేదు. ఆధార్ నమోదుకు జిల్లాలో ఏర్పాటు చేసిన 39 శాశ్వత కేంద్రాలు సరిపోవడం లేదు. కొత్తగా మరో 13 సెంటర్లను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు.
విద్యుత్ సేవలకూ తప్పదు
తాజాగా విద్యుత్ శాఖ కూడా ఆధార్ అనుసంధానం బాట పట్టింది. వినియోగదారుల నుంచి ఆధార్ నంబర్లు సేకరించే పనిలో పడింది. జిల్లాలో 11,75,431 మంది వినియోగదారులు తమ ఆధార్ కార్డు నంబర్లను విద్యుత్ అధికారులకు అందించాల్సి ఉంది.
రేషన్ కావాలన్నా ఆ కార్డే దిక్కు
జిల్లాలో 11,72,134 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. 2,200 రేషన్ షాపుల ద్వారా బియ్యం, కిరోసిన్‌తోపాటు ‘అమ్మహస్తం’ సరుకులు సరఫరా చేస్తున్నారు. ఈ కార్డులకు సంబంధించి 35,69,338 యూనిట్లకు ఆధార్ నమోదు చేయించాల్సి ఉండగా, ఇప్పటివరకూ దాదాపు 28,95,076 యూనిట్లతో ఆధార్ అనుసంధానం పూర్తయ్యింది. మిగిలిన యూనిట్లకు రేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ నమోదు చేయించుకోని యూనిట్లకు బియ్యం సరఫరా నిలిపివేయనున్నట్టు అధికారుల మాటగా రేషన్ డీలర్లు చెబుతున్నారు. తొలుత ఆగస్టు 7వ తేదీ వరకూ గడువు ఇచ్చినా సరిపోకపోవడంతో ఈ నెల 15వరకూ పొడిగించారు. ఆ గడువు కూడా దాటితే ఆధార్ లేనివారికి రేషన్ నిలిపివేస్తామంటున్నారు.
గ్యాస్‌కూ తప్పడం లేదు
జిల్లాలో 8.60 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 6 లక్షల మంది ఆధార్ కార్డు నంబర్లను గతంలోనే గ్యాస్ ఏజెన్సీలకు సమర్పించారు. కానీ కేవలం 64 శాతం మంది ఆధార్ నంబర్లు మాత్రమే బ్యాంకు అకౌంట్లతో అనుసంధానమయ్యాయి. గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ ఇచ్చే విషయంలో ఆధార్ లింక్‌ను తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ప్రకటించింది. జిల్లాలో ఇప్పటికే కొందరు ఆధార్ అనుసంధానం చేరుుంచుకోగా, కేంద్రం ప్రకటనతో మిగిలిన వారు ఆధార్ నంబర్ ఇవ్వాలో లేదో తెలియని గందరగోళంలో ఉన్నారు. అయితే బ్యాంకుల్లో మళ్లీ ఆధార్ నంబర్ అడుగుతున్నారు.
ఆధార్ ఉంటేనే రుణమాఫీ
ఇంటికి ఒక్క రుణం మాత్రమే.. అదీ లక్షన్నర వరకూ మాఫీ చేస్తానంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులు బ్యాంకు అకౌంట్లను ఆధార్ నం బర్‌తో అనుసంధానించుకుంటేనే మాఫీ వర్తిస్తుందని చెబుతోంది. జిల్లాలో దాదాపు 8లక్షల 80వేల మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తుందంటున్నారు. వీరిలో ఎందరికి ఆధార్ కార్డులున్నాయనే దాని పై అధికారుల వద్ద ఇప్పటివరకూ సమాచారం లేదు. కొత్తగా రుణా లు పొందాలంటే కూడా ఆధార్ నంబర్ ఉండాలంటున్నారు.