బాధ విన్నారు.. భరోసా కలిగించారు | AP Govt Actions to move women trapped in Kuwait | Sakshi
Sakshi News home page

బాధ విన్నారు.. భరోసా కలిగించారు

Published Wed, Jan 29 2020 4:45 AM | Last Updated on Wed, Jan 29 2020 9:28 AM

AP Govt Actions to move women trapped in Kuwait - Sakshi

సాక్షి, అమరావతి/అత్తిలి : ‘జగనన్నా, మమ్మల్ని మీరే కాపాడాలి’.. అంటూ నలుగురు మహిళలు కువైట్‌ నుంచి పంపిన వీడియో వైరల్‌ కావడం.. అది సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి వెళ్లడం.. వెంటనే ఆయన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో సీఎం కార్యాలయం హుటాహుటిన స్పందించింది. సదరు వీడియోను డీజీపీ డి. గౌతమ్‌ సవాంగ్‌కు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో ఆయన ‘దిశ’ చట్టం ప్రత్యేక అధికారి దీపికా పాటిల్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవల్‌ను అప్రమత్తం చేశారు.తమను ఏజెంట్‌ మోసం చేశాడని, కువైట్‌లో పనిలేకుండా ఉన్నామని.. తమను ఆదుకోవాలంటూ పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామానికి చెందిన కరెం వసుంధర కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశిస్తూ ఓ వీడియోను వాట్సాప్‌ ద్వారా తన వాళ్లకు పంపించింది.

ఆ వీడియో వైరల్‌ కావడంతో.. ‘జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి’ అంటూ ఈ నెల 25న ‘సాక్షి’ ఆమె ఆవేదనను ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఎంఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాధితురాలు వసుంధరకు సంబంధించిన వివరాలు సేకరించారు. పేదరికం కారణంగా కుటుంబ పోషణ కోసం ఆర్నెల్ల క్రితం వసుంధర కువైట్‌ వెళ్లినట్లు.. అలాగే, వారం రోజుల క్రితం కువైట్‌ ఎంబసీ పునరావాస కేంద్రాన్ని ఆశ్రయించినట్లు తెలుసుకున్నారు. కాగా, కడపకు చెందిన ఓ ఏజెంట్‌ సాయంతో ఆమె క్షేమ సమాచారాలు కూడా తెలుసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ ‘సాక్షి’కి తెలిపారు.

వసుంధర పాస్‌పోర్టు అక్కడి యజమాని వద్ద ఉండిపోయినందున దానిని తిరిగి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కువైట్‌లోని భారతీయ ఎంబసీకి బాధితురాలి తల్లి శాంతకుమారి రాసిన లేఖను మెయిల్‌ చేశామని.. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్‌కు కూడా శాంతకుమారి లేఖను మెయిల్‌ చేశామని ఆయన వివరించారు. అలాగే, కువైట్‌లోని కాన్సులేట్‌ కార్యాలయాన్ని కూడా సంప్రదించామని గ్రేవల్‌ చెప్పారు. వసుంధరతోపాటు మిగిలిన మహిళలను కూడా రప్పించేందుకు దిశ చట్టం ప్రత్యేక అధికారి దీపిక ఆధ్వర్యంలో తణుకు సీఐ, అత్తిలి ఎస్సై మరికొందరితో పోలీస్‌  ప్రత్యేక బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. కాగా, ఇదే విషయాన్ని కువైట్‌లోని బాధితులు కూడా ధృవీకరించారు.

ఏపీ నుంచి పోలీసులు తమతో మాట్లాడారని వారు మరో వీడియోను పంపించారు. ఇందులో, ‘జగనన్నా.. కొద్దిరోజుల్లోనే మమ్మల్ని ఆదుకున్నందుకు ధన్యవాదాలన్నా.. మీ మేలు మరువలేం.. ఇక్కడ అందరూ బాగా సహకరిస్తున్నారు.. ధైర్యం చెబుతున్నారు.. థ్యాంక్స్‌’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తె క్షేమంగా వస్తుందని జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వసుంధర తల్లి శాంతకుమారి విశ్వాసం వ్యక్తంచేసింది. ఇదిలా ఉంటే.. మహిళలను కువైట్‌ పంపిన ఇరగవరం మండలం పొదలాడకు చెందిన సబ్‌ఏజెంట్‌ లక్ష్మణరావును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

వారం రోజుల్లోపు తీసుకొస్తాం
కరెం వసుంధర, మరో ముగ్గురు మహిళలు కువైట్‌లోని పునరావాస శిబిరంలో ఉన్నట్లు నిర్ధారించుకున్నాం. వారిని సొంతూళ్లకు తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఇప్పటికే కువైట్‌ ఎంబసీ అధికారులు, అక్కడి లేబర్‌ కమిషనర్‌ను ‘పశ్చిమ’ పోలీసులు సంప్రదించారు. బాధితులు ఏ తప్పూ చేయలేదని నిర్ధారణ అయ్యింది. దీనివల్ల చట్టపరమైన చిక్కులు ఉత్పన్నం కావు. పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు, సంప్రదింపులు సానుకూలంగా ఉన్నాయి. నాలుగు నుంచి వారం రోజుల్లో వారిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 
– గౌతమ్‌ సవాంగ్, రాష్ట్ర డీజీపీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement