రూ.50 లక్షల చెక్కును ఏఎస్‌ఐ సోదరుడు కానిస్టేబుల్ రహంతుల్లాకు అందిస్తున్న డీజీపీ
అనంతపురం క్రైం/అమరావతి: కోవిడ్–19 బారినపడి ప్రాణాలు కోల్పోయిన ఏఎస్‌ఐ హబీబుల్లా కుటుంబానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం గొప్ప విషయమని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా భారీ మొత్తంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారన్నారు. అందుకు ఏపీ పోలీసుల తరఫున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సీఎం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తికి మించి పని చేసి కోవిడ్ నివారణకు కృషి చేస్తామని చెప్పారు.
స్వయంగా వెళ్లి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఆ కుటుంబానికి అందజేయాలని సీఎం ఆదేశించడంతో డీజీపీ శనివారం అనంతపురంలో పర్యటించారు. కిమ్స్ సవీరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్‌ఐ కుటుంబ సభ్యులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కును ఏఎస్‌ఐ సోదరుడు కానిస్టేబుల్ రహంతుల్లాకు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ యుద్ధంలో పాల్గొంటున్న పోలీసులకు రక్షణగా ప్రభుత్వం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ), ఎన్ 95 మాస్క్‌లు అందించడం కోసం రూ. 2.89 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. అంతకుముందు డీజీపీ సవాంగ్.. వైరస్ నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై కోవిడ్–19 ప్రత్యేకాధికారి, కలెక్టర్, ఐజీ, డీఐజీ, ఎస్పీ తదితరులతో సమీక్ష నిర్వహించారు. కాగా, అనంతపురం పర్యటన వివరాలను డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment