కువైట్ విమానాశ్రయంలో బాధిత మహిళలతో ఎన్.మహేశ్వర్‌రెడ్డి
కడప కార్పొరేషన్: కువైట్‌లో ఇబ్బందులు పడుతున్న మహిళలను ఇండియాకు పంపించేందుకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) చేసిన కృషి ఫలించింది. మంగళవారం వైఎస్సార్ జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు, చిత్తూరుకు చెందిన మరో మహిళ స్వస్థలాలకు చేరిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా టి. సుండుపల్లెకు చెందిన పళ్లపు మహేశ్వరి, చింతకొమ్మదిన్నెకు చెందిన మొగిళ్ల సుజాత, పుల్లంపేటకు చెందిన పళ్లపు వెంకటమ్మ, చిత్తూరు జిల్లా మదనపల్లె, బొమ్మన్ చెరువుకు చెందిన పెద్ద కొండేటి గీత కువైట్‌లో ఒకే ఇంట్లో పనిచేస్తుండేవారు. కువైటీ(స్పాన్సర్) సక్రమంగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆ బాధల నుంచి ఎలా విముక్తి పొందాలని ఆలోచిస్తుండగా సోషల్ మీడియాలో ఏపీఎన్‌ఆర్‌టీఎస్ వారి నంబర్లు చూసి సాయం చేయాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం ఏపీఎన్‌ఆర్‌టీఎస్ రీజినల్ కో–ఆర్డినేటర్ ఎన్.మహేశ్వర్‌రెడ్డి తదితరులు భారత రాయబార అధికారులతో మాట్లాడి వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. తమను ఆదుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సభ్యులు ఎన్.మహేశ్వర్‌రెడ్డి, ఆకుల ప్రభాకర్‌రెడ్డి, రహమతుల్లా, సుబ్బారెడ్డికి బాధిత మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment