సాక్షి, అమరావతి : కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.ఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. కరోనా నియంత్రణకు రెండు వ్యూహాలు అనుసరిస్తున్నామని తెలిపారు. వాటిల్లో ఒకటి కంటైన్‌మెంట్ క్లస్టర్ కాగా మరొకటి ఆస్పత్రుల సదుపాయం కల్పించడమని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 154 క్లస్టర్లను గుర్తించి కంటైన్‌మెంట్ చేశామన్నాని, గురువారం నమోదైన 32 పాజిటివ్ కేసులు ఇందులోనే ఉన్నాయా లేక ఇతర ప్రాంతాల్లో ఉన్నాయా అన్నది గుర్తించాలన్నారు. రాష్ట్రంలో వైద్య పరికరాల కొరత లేదని, నాలుగు రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయన్నారు. (తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా)
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 16,555 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్రంలో 6,076 మంది క్వారంటైన్ సెంటర్లలో ఉంచామని జవహర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 17,445 క్వారంటైన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశం మాట్లాడుతూ.. రెండుసార్లు కరోనా నెగిటివ్ వస్తేనే క్వారంటైన్‌లో ఉన్నవారిని ఇంటికి పంపుతున్నామని పేర్కొన్నారు. అయితే ఇంటికి చేరుకున్న తరువాత కూడా ముందస్తు జాగ్రత్తగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
‘రాష్ట్రంలో మొత్తం ఏడు కరోనా ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి. వైరస్ కట్టడికి కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు జోన్లను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 94 మండలాల్లో కరోనా కేసులు బయటపడ్డాయి. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత కూడా జోన్లను ఏర్పాటు చేస్తాం. కంటైన్‌మెంట్ జోన్లకు షరతులు వర్తించవు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో టెస్టింగ్ సామర్థ్యం బాగుంది. కరోనా పరీక్షల కోసం లక్ష ట్రూనాట్ కిట్స్‌కు ఆర్డర్ ఇచ్చాం. ట్రూనాట్ కిట్ల ద్వారా రోజుకు 4 వేల పరీక్షలు చేయొచ్చు. ట్రూనాట్ కిట్లను 13 జిల్లాల్లో 49 సెంటర్లకు పంపిస్తాం. రోజుకు 17 వేల టెస్ట్‌లు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment