
సాక్షి, అమరావతి : మీకు మంచి సెంటర్‌లో పదెకరాల భూమి ఉంది. ఏదైనా నిర్మాణం చేయడానికి కావాల్సిన నిధులున్నాయి. మీరు ఆ స్థలంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనుకుంటే ఏం చేస్తారు? మీరే స్వంతంగా నిర్మించుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఓ ప్రైవేటు సంస్థ ఫైవ్‌స్టార్ హోటల్, షాపింగ్ మాల్ కట్టుకునేందుకు ఏకంగా రూ.905 కోట్ల విలువైన భూమిని నామమాత్రపు లీజుకు కట్టబెట్టేస్తుంది. వెనుకబడిన ప్రాంతంలో అయితే రాయితీలిచ్చి ప్రోత్సహించడం సహజం. కానీ పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది ముందుకు వచ్చే వైజాగ్‌లాంటి పట్టణంలో ఓ ప్రైవేటు కంపెనీ హోటల్ కట్టుకునేందుకు భారీ రాయితీలు ఎందుకు?
అసలు ఏ ప్రభుత్వమైనా ఒక ప్రైవేట్ గ్రూపునకు ఇచ్చేందుకు మరో ప్రైవేట్ సంస్థకు చెందిన భూమిని తీసుకుంటుందా? తీసుకున్న భూమికి బదులు ప్రభుత్వ సంస్థలకు చెందిన భూములను కేటాయిస్తుందా? ఆ విధంగా కేటాయించిన భూమిని ఆ ప్రైవేట్ సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికయ్యే రిజిస్ట్రేషన్ ఫీజును, స్టాంపు డ్యూటీని, కేపిటల్ గైన్స్‌ను ఖజానా నుంచి భరిస్తుందా? అంటే ఎవ్వరైనా సరే అలా చేయరనే చెబుతారు... కానీ చంద్రబాబు సర్కారు మాత్రం అదే పని చేసింది. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.171.27కోట్ల భారం మోపింది. ఆ మొత్తంతో ప్రభుత్వమే స్వయంగా> హోటల్, కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్ కట్టే అవకాశమున్నా పక్కన పెట్టేసింది. చట్టానికి, నిబంధనలకు వ్యతిరేకంగా లూలూ గ్రూపునకు, సీఎంఆర్ గ్రూపునకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగారు. న్యాయశాఖతో పాటు విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, విశాఖ జిల్లా కలెక్టర్ అభ్యంతరాలను బేఖాతరు చేశారు. మొత్తం ఈ వ్యవహారంలో భారీఎత్తున ముడుపులు చేతులు మారినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి...
నామమాత్రపు లీజుకు విలువైన భూముల అప్పగింత
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన లూలూ గ్రూపునకు విశాఖపట్నంలో రూ.905 కోట్ల విలువైన భూములు కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్కే బీచ్ ఫ్రంట్ దగ్గర ఎకరాకు రూ.50 లక్షల నామమాత్రపు లీజునకు 12.52 ఎకరాలు లూలూ గ్రూపునకు కేటాయించారు. మొదట లీజు కమ్ డెవలప్‌మెంట్ కింద ఏపీఐఐసీకి చెందిన 9.12 ఎకరాలను ఏడాదికి రూ.4.51 కోట్ల లీజు కింద ఇచ్చారు. అది చాలదన్నట్లు సీఎంఆర్ సంస్థకు చెందిన మరో 3.40 ఎకరాల భూమిని సేకరించి ఇస్తున్నారు. దీనికి అదనంగా ఐదుశాతం లీజు వసూలు చేయాలని నిర్ణయించారు. లూలూకోసం తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా సీఎంఆర్ సంస్థకు రూ.321 కోట్లు విలువైన 4.85 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి ఈ వ్యవహారం సెటిల్ చేయడం విశేషం. దీనివల్ల ఖజానాపై నేరుగా రూ.171.27కోట్ల భారం పడుతున్నా పట్టించుకోలేదు. సమీపంలోని మరో ప్రైవేట్ సంస్థకు చెందిన 1.99 ఎకరాల భూమిని లూలూ గ్రూపు కొనుగోలు చేసుకునేందుకు ఏపీఐఐసీ సహాయ సహకారాలు అందించనుండటం గమనార్హం.
స్వయంగా సీఎం బేరసారాలు...
విశాఖపట్టణం జిల్లా వాల్తేరు వార్డు ఆర్కేబీచ్ ఫ్రంట్ దగ్గర లూలూ గ్రూపు ఐదు నక్షత్రాల హోటల్‌తో పాటు, మెగా కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. తొలుత 9.12 ఎకరాల్లో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కొచ్చి వెళ్లి అక్కడ లూలూ గ్రూపు కన్వెన్షన్ సెంటర్‌ను సందర్శించి వచ్చారు. వారితో మంతనాలు జరిపారు. ఆర్కే బీచ్ ఫ్రంట్ దగ్గర గల సీఎంఆర్ గ్రూపునకు చెందిన 3.40 ఎకరాలు కూడా ఉంటే కన్వెన్షన్ సెంటర్ బీచ్ ఫ్రంట్‌లో వస్తుందని లూలూ గ్రూపు యాజమాన్యం, చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. ఎలాగైనా సరే సీఎంఆర్ గ్రూపునకు చెందిన భూమిని తీసుకుని లూలూ గ్రూపునకు కేటాయించాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎంఆర్ గ్రూపు ప్రతినిధులతో స్వయంగా ఆయనే బేరసారాలను కొనసాగించారు. గత ఏడాది జూలై 19వ తేదీన సమావేశం ఏర్పాటు చేసి సీఎంఆర్ గ్రూపునకు చెందిన 3.40 ఎకరాల భూమిని తీసుకుని ఆ గ్రూపునకు ప్రత్యామ్నాయంగా మరో చోట ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సీఎంఆర్ గ్రూపు ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు.
సీఎంఆర్ షరతులన్నింటికీ తలూపిన సర్కారు
తామిచ్చే 3.40 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా 1:1.5 రేషియోలో భూమి కేటాయించాలని సీఎంఆర్ గ్రూపు ప్రతినిధులు స్పష్టం చేశారు. అంతేకాకుండా తమకు ప్రత్యామ్నాయంగా కేటాయించే భూమి విలువకయ్యే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, కేపిటల్ గెయిన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండు చేశారు. అలాగే ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూమి 150 ఫీట్ రోడ్డుకు అన్ని వైపులా 25 శాతం సెట్ బ్యాక్ ఇవ్వాలని, అదనపు అంతస్తులకు అనుమతివ్వాలని, ఆ భూమిని మిశ్రమ వినియోగానికి అనుమతివ్వాలని, వాస్తుకు అనుగుణంగా వుడా మాస్టర్ ప్రణాళికలో అవసరమైన సవరణలు చేయాలని సీఎంఆర్ గ్రూపు తన డిమాండ్లలో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో సీఎంఆర్ గ్రూపు డిమాండ్లన్నింటినీ అంగీకరించారు. ఆరు చోట్ల ప్రత్యామ్నాయంగా 4.85 ఎకరాలను ఇవ్వాలని నిర్ణయించారు. రహదారులు–భవనాలు, వుడా, గ్రేటర్ విశాఖపట్టణం కార్పొరేషన్‌కు చెందిన ఆ 4.85 ఎకరాల్లో 2.15 ఎకరాలు వచ్చే ఏడాదివరకు హెచ్‌బీసీకి లీజుకు ఇచ్చారు. ఇప్పుడు హెచ్‌బీసీతో సంప్రదింపులు జరిపి ఆ లీజును రద్దు చేయాలని, అలాగే మిగతా భూములను ఎవ్వరికైనా లీజుకు ఇస్తే ఆ లీజులను రద్దు చేయాలని సీఎం ఆదేశించారు.
ఖజానాపై రూ.171 కోట్ల భారం
లూలూ గ్రూపునకు ఇస్తున్న ఆర్కే బీచ్ ఫ్రంట్ దగ్గర గల సీఎంఆర్ గ్రూపునకు చెందిన 3.40 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ.246.84 కోట్లుగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే ప్రత్యామ్నాయంగా సీఎంఆర్ గ్రూపునకు కేటాయిస్తున్న 4.85 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ.321 కోట్లుగా పేర్కొన్నారు. ఆ భూమిని వుడా, రహదారులు–భవనాలు, గ్రేటర్ విశాఖలు సీఎంఆర్ గ్రూపు పేరు మీద క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ విలువైన భూమికి కేపిటల్ గెయిన్ కింద 20 శాతం మేర రూ.64.20 కోట్లు, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ కింద రూ.24.07 కోట్లు, సీఎంఆర్ గ్రూపు భూమి విలువ ప్రత్యామ్నాయంగా ఇస్తున్న భూమి విలువకు మధ్య వ్యత్యాసం రూ.75 కోట్లు, ఆర్కే బీచ్ ఫ్రంట్ దగ్గర సీఎంఆర్ గ్రూపు భూమిలో గల ఫంక్షన్ హాల్‌కు రూ.ఎనిమిది కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.171.27 కోట్ల భారం పడుతున్నా సర్కారు పట్టించుకోకపోవడం గమనార్హం.
న్యాయశాఖ, కలెక్టర్ అభ్యంతరాలు బేఖాతరు
2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వడానికి వీల్లేదని, అలాగే మూడో పార్టీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోరాదని న్యాయశాఖ అభిప్రాయపడింది. అలాగే కేపిటల్ గెయిన్స్‌తో పాటు ఇతర రిజస్ట్రేషన్ చార్జీలను, ఇతర పన్నులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం అనేది చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. మూడవ పార్టీ అంగీకరించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించవచ్చే తప్ప నేరుగా ప్రభుత్వ జోక్యం ఉండరాదని పేర్కొంది. ఎంత భూమి తీసుకుంటే అంతే భూమి, అంతే విలువను మాత్రమే పరిహారంగా ఇవ్వాలని, అంతకన్నా ఎక్కువ ఇవ్వరాదని వుడా వైస్ చైర్మన్, జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ఈ అభ్యంతరాలన్నింటినీ పక్కన పెట్టి లూలూ గ్రూపునకు, అలాగే సీఎంఆర్ గ్రూపునకు భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ... రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
లూలూ సంస్థకు మొదట కేటాయించిన భూమి 9.12 ఎకరాలు
సీఎంఆర్ గ్రూపునుంచి సేకరించిన భూమి 3.40 ఎకరాలు
ప్రత్యామ్నాయంగా సీఎంఆర్‌కు కేటాయించిన భూమి 4.84 ఎకరాలు
కలెక్టర్ నివేదిక ప్రకారం ఎకరా మార్కెట్ విలువ రూ.72.35 కోట్లు
మొత్తం 12.52 ఎకరాల మార్కెట్ విలువ రూ.905.82 కోట్లు
ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు వల్ల భారం రూ.171.27 కోట్లు
మొత్తంమీద ప్రభుత్వానికి వచ్చే లీజు ఏడాదికి రూ.6.27 కోట్లు