
తిత్లీ తుఫాన్ నష్టంపై ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రాథమిక నివేదిక అందజేసింది.
సాక్షి, అమరావతి : శ్రికాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించిన తిత్లీ తుఫాన్ నష్టంపై శనివారం ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రాథమిక నివేదిక అందజేసింది. ఈ తుఫాన్ ధాటికి సుమారు 9 లక్షల మంది ప్రభావితమయ్యారని, 8 మంది మృతి చెందారని, ఇద్దరు మత్స్యకారులు గల్లంతైనట్లు అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. 290 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయని, 8,962 ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థం కావడంతో సుమారు 4319 గ్రామాలు చీకటిమయమయ్యాయని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని 1,39,844 హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని, మత్స్య శాఖకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొన్నారు. అలాగే 80 చెరువులు దెబ్బతిన్నాయని, 87 పశువులు మృతి చెందినట్లు చెప్పారు. శ్రీకాకుళంలో 15 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.