'టీడీపీ ప్రభుత్వానికి ఆ సత్తా లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తగ్గించడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె. పార్థసారథి విమర్శించారు. 'ఆధార్' లింక్ పేరుతో రేషన్ కార్డులు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆధార్ కార్డుతో లింక్ వద్దని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉన్న పథకాలకు కోతలు పెట్టడమే తప్పా కొత్త పథకాలు తెచ్చే సత్తా టీడీపీ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. హుదూద్ తుపాను బీభత్సం సృష్టించి 10 రోజులు గడిచినా బాధితులకు సరైన సహాయం అందడంలేదని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు.