పల్లెలో నవ వసంతం | AP Grama Sachivalayam To Be Started from 2 Oct | Sakshi
Sakshi News home page

పల్లెలో నవ వసంతం

Published Fri, Sep 27 2019 3:50 AM | Last Updated on Fri, Sep 27 2019 7:45 AM

AP Grama Sachivalayam To Be Started from 2 Oct  - Sakshi

కృష్ణా జిల్లా జూపూడిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న గ్రామ సచివాలయ భవనం

సాక్షి, అమరావతి: మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయి. గ్రామీణాంధ్రప్రదేశ్‌లో ఇక నవ వసంతం వెల్లివిరియనుంది. గ్రామ ప్రజల సమస్యలన్నింటికీ సత్వర పరిష్కారం చూపేలా ఒకే వేదిక తుదిమెరుగులు దిద్దుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 2వ తేదీ నుంచి కొత్తగా ప్రవేశ పెట్టనున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపనుంది. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో విన్నవించిన 72 గంటల్లోనే సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఉద్యోగులు, సిబ్బంది నియామక ప్రక్రియ సైతం పూర్తికావచ్చింది.

ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన ప్రజల కనీస ఇబ్బందులు, సమస్యలు, వినతులు గ్రామ స్థాయిలోనే పరిష్కరించేందుకు సచివాలయ వ్యవస్థను ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు, విద్యార్థులకు అవసరమైన వివిధ సర్టిఫికెట్లు వెంటనే అందనున్నాయి. గ్రామంలో రైతుల సమస్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి అవసరమైన సేవలు అందించే అవకాశాలు మెరుగు పడతాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న 13,065 గ్రామ పంచాయతీలను 11,158 గ్రామ సచివాలయ కేంద్రాలుగా వర్గీకరించి కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఈ భవనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన రంగులతో అలంకరిస్తున్నారు. కార్యాలయ భవనంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో, ఆ గ్రామం పేరు రాసేలా ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

ప్రజల నుంచి అందిన వినతుల మేరకు పింఛన్లు, రేషన్‌కార్డులు, లోన్‌ ఎలిజిబులిటీ కార్డుల వంటివి మంజూరు అనంతరం సచివాలయంలోనే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఒక జిల్లాలోని మొత్తం సచివాలయాలకు అవసరమైన సామగ్రిని ఏకమొత్తంగా కొనుగోలు చేస్తారు. ఈ మేరకు 13 జిల్లాలకు కలిపి ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేసింది. జిల్లాల్లో కొనుగోలు టెండర్ల ప్రక్రియ సాగుతోంది. కాగా, అక్టోబరు 2వ తేదీన మండలంలో కనీసం ఒక గ్రామంలో గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలుత రాష్ట్ర వ్యాప్తంగా 661 గ్రామ సచివాలయ భవనాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ఆయా కార్యాలయాల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

చకచకా పనులు
విశాఖపట్నం జిల్లాలో తొలిరోజు అక్టోబరు 2వ తేదీన 39 గ్రామ సచివాలయాలను ప్రారంభించనున్నారు. వీటిలో భీమిలి మండలంలోని చేపలుప్పాడ, అన్నవరం, యలమంచిలి మండలంలోని ఏటికొప్పాక గ్రామ సచివాలయాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలో 844 గ్రామ సచివాలయాలు, అర్బన్‌ ప్రాంతాల్లో 306 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్టోబరు 2న మండలానికొకటి చొప్పున మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించేందుకు ముస్తాబు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో అక్టోబర్‌ 2వ తేదీన బేతంచర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురంలోని గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర ఆర్థిక, శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఆలూరులో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖమంత్రి గుమ్మనూరు జయరాం ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మోడల్‌ గ్రామ సచివాలయ భవనం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తాగు నీటి పైపులైన్, విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. ఫర్నిచర్, స్టేషనరీ, ఒక కంప్యూటర్‌ సిద్ధం చేశారు. రెండు, మూడు రోజుల్లో రంగులు వేయడం పూర్తవుతుంది. ఈ సచివాలయ భవనాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. యర్రగొండపాలెంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సచివాలయ భవనం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇదే రీతిలో అన్ని జిల్లాల్లో పలు గ్రామ సచివాలయాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.

మౌలిక వసతులు సమకూరుస్తున్నాం
అక్టోబరు 2వ తేదీన మండలానికి ఒక గ్రామంలో గ్రామ సచివాలయాన్ని అన్ని వసతులతో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశాం. ఆయా గ్రామాల్లో సచివాలయ కార్యాలయ భవనాలను జిల్లా అధికారులు కొత్త రంగులతో అలంకరిస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్, ప్రింటర్‌ వంటి ఇతర మౌలిక వసతులను కూడా కల్పిస్తున్నాం. మిగిలిన గ్రామాల్లోని సచివాలయ కార్యాలయాల్లోనూ పర్నిచర్, ఇతర మౌలిక వసతులను దశల వారీగా కల్పిస్తాం.
– గిరిజా శంకర్, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌.

ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనుకోలేదు
మాది నిరుపేద కుటుంబం. మా నాన్న చిరంజీవులు రోజు కూలీగా కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. నేను ప్రభుత్వ ఉద్యోగిని అవుతానని అనుకోలేదు. 2008 – 2010లో వెటర్నరీ డిప్లొమా పూర్తి చేశాను. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. ఈనాటికి నా కల నెరవేరింది. ఎలాంటి సిఫార్సు లేకుండా ఉద్యోగం పొందాను. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేలును ఎప్పటికీ మర్చిపోలేం. గ్రామీణులకు సత్వర సేవలు అందేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
– ఎస్‌.బాలకృష్ణ, పడిమందస గ్రామం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా

►రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీలు 13,065
►మొత్తం గ్రామ సచివాలయ కార్యాలయాలు 11,158
►సొంతంగా గ్రామ పంచాయతీ భవనం ఉన్న గ్రామాలు 7,500
►సొంతంగా గ్రామ పంచాయతీ భవనం లేని గ్రామాలు (అద్దె) 1850
►అదనంగా గ్రామ పంచాయతీ భవనాలు అవసరం ఉన్న గ్రామాలు (అద్దె) 1,800
►వీటన్నింటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య దాదాపు 1,34,524
►శాశ్వత భవనాల విస్తీర్ణం చదరపు అడుగులు 2800

సచివాలయ సామగ్రి : 2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, స్కానర్లు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం, బయోమెట్రిక్‌ డివైస్, ఆధార్‌ ఎనేబుల్డ్‌ ట్యాబ్‌లు, 10 టేబుళ్లు, 30 కుర్చీలు, 6 టేబుల్‌ ర్యాకులు, ఒక బీరువా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement