హైకోర్టు నూతన న్యాయమూర్తులు జస్టిస్ జయసూర్య, జస్టిస్ రమేశ్, జస్టిస్ దేవానంద్, జస్టిస్ రఘునందన్ రావుతో ప్రమాణం చేయిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి (ఎడమ నుంచి కుడికి)
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ నలుగురి నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ చదివి వినిపించారు. అనంతరం వీరిచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వేర్వేరుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, తడకమళ్ల వినోద్‌కుమార్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.జగన్నాథరావు, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ప్రమాణం చేసిన నలుగురు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్ జనరల్, ఇతర రిజిస్ట్రార్లు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఈ నలుగురుని న్యాయవాదులు అభినందించారు. ఆ తరువాత సీజే జస్టిస్ జేకే మహేశ్వరితో కలిసి జస్టిస్ జయసూర్య కేసులను విచారించారు. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్ జడ్జిలుగా కేసులు విచారించారు. ఈ నలుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది. వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసిన
విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment