రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను భూసేకరణ ద్వారా సేకరించేందుకు వీలుగా జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి రెండు వారాలపాటు తాము ఎటువంటి చర్యలు చేపట్టబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు హామీ ఇచ్చింది.
భూసేకరణ నోటిఫికేషన్‌పై హైకోర్టుకు ఏపీ సర్కారు హామీ
పూర్తి వివరాలతో
కౌంటర్ దాఖలుకు ఆదేశం
హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను భూసేకరణ ద్వారా సేకరించేందుకు వీలుగా జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి రెండు వారాలపాటు తాము ఎటువంటి చర్యలు చేపట్టబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు హామీ ఇచ్చింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) ఇచ్చిన ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు.
భూసేకరణ ద్వారా భూములను సేకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపేయాలంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన రైతులు మొక్కపాటి స్వర్ణ తదితరులు పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం విచారించారు. 2013లో తీసుకొచ్చిన కొత్త భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్ 4లోని సెక్షన్ 10 ఎ(1) ప్రకారం ప్రజోపయోగ ప్రాజెక్టుల జాబితాలో రాజధాని నగరాభివృద్ధి ప్రాజెక్టును చేర్చిందని, ఇలా చేర్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. రాజధాని నగరాభివృద్ధి ప్రాజెక్టును ప్రజోపయోగ ప్రాజెక్టుగా ఆర్డినెన్స్ 4లో పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త భూసేకరణ చట్టంలో ఆహార భద్రత గురించి ప్రస్తావన ఉందని, దీనిప్రకారం బహుళ పంటలు పండే సాగు భూములను సేకరించడానికి వీల్లేదని తెలిపారు.
అదనపు ఏజీ డి.శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ‘మౌలిక సదుపాయాల ప్రాజెక్టు’కు విస్తృత అర్థముందని నివేదించారు. ఈ రోజుకీ భూసమీకరణ ద్వారానే భూములను తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ దానికి సంబంధించి రెండు వారాలపాటు ఎటువంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు నివేదించారు. గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ.. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేశారు.