సాక్షి, అమరావతి: నిజాలు రాసే పత్రికలు భయపడాల్సిన అవసరం లేదని.. మీడియాకు సంకెళ్లు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ఖండించారు. శుక్రవారం సచివాలయంలో మరో మంత్రి కొడాలి నానితో కలిసి మీడియాతో మాట్లాడారు. పత్రికలను నియంత్రించే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవని, ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేసే ప్రయత్నాలు జరిగితే ఆ వార్తలను సంబంధిత అధికారి ఖండివచ్చన్నారు. ఏపీ ప్రభుత్వం గత నెల 30న జారీ చేసిన జీవో 2430పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సరైన ఆధారాలతో వార్తలు ప్రచురించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏదైనా ఒక పత్రిక ప్రభుత్వ శాఖలో జరిగే నిర్ణయాలను వాస్తవాలకు విరుద్ధంగా ప్రసారం చేస్తే అలాంటి వాటిని నియంత్రించేందుకు ఈ జీవో విడుదల చేశామని వివరణ ఇచ్చారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు సంబంధిత అధికారి చర్యలు తీసుకోవాలని జీవోలో పేర్కొన్నామన్నారు.
చంద్రబాబు రాజకీయాలు విడ్డూరం..
కలానికి సంకెళ్లు, పత్రికా స్వేచ్ఛకు భంగం అంటూ కథనాలు ప్రచురితం చేయడం సరికాదన్నారు. ఆధారాలతో వార్తలు రాయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేసే ప్రయత్నాలు జరిగితే.. ఆ వార్తలను సంబంధిత శాఖ అధికారి ఖండించవచ్చన్నారు. రిజాయిండర్ ప్రచురింతకపోతే కోర్టును కూడా ఆశ్రయించవచ్చని వెల్లడించారు. విలేకరులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని, మీడియా యాజమాన్యం ప్రజాస్వామ్యం కంటే తాము గొప్ప అనుకోవడం సరికాదన్నారు. ఈ జీవోపై చంద్రబాబు రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు చెప్పేది ఓ వర్గం మీడియాకు కమ్మగా ఉంటుందని ఎద్దేవా చేశారు. విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలని, పత్రికా యాజమాన్యాలు ఎవరి కోసం పని చేస్తున్నాయో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
పిచ్చిరాతలు మాని.. వాస్తవాలు రాయండి..
ప్రభుత్వం విడుదల చేసిన జీవో 2430 కలానికి సంకెళ్లు వేయదని, తప్పుడు వార్తలు రాసే కులానికి సంకెళ్లు పడతాయని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. పిచ్చి రాతలు మాని..వాస్తవాలు రాయాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment