ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తెలంగాణ సర్కారు ఉల్లంఘించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తెలంగాణ సర్కారు ఉల్లంఘించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్పునకు ఇరు రాష్ట్రాల అంగీకారం అవసరమని, అలా కాకుండా ఇష్టారాజ్యంగా పేరు మార్చేయడం సరికాదని ఆయన అన్నారు. సెక్షన్ 95 ప్రకారం ఈ విశ్వవిద్యాలయంలో ఇరు రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
కాగా, ఈ విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. వీసీని నియమించకుండా ఆపుతానని ఆయన హామీ ఇచ్చారన్నారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తామని గవర్నర్ చెప్పినట్లు ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు.