
సాక్షి, తాడేపల్లి: సీఏఏకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముస్లిం మైనార్టీల ఆందోళన విషయంలో ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని పేర్కొన్నారు. వారికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వివాదస్పద ఎన్ఆర్‌సీ,ఎన్‌పీఆర్ బిల్లులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, గతంలో పేర్కొన్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. (ఏపీ సర్కార్ మరో కీలక ఒప్పందం)
ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ద్వారకానాథ్
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ముక్కాల ద్వారకానాథ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య ప్రముఖులు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. (ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్ విజయమ్మ)
Comments
Please login to add a commentAdd a comment