ఉద్యమం ఉధృతం
Published Thu, Feb 13 2014 12:53 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
సాక్షి, కాకినాడ:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకపక్ష నిరంకుశ వైఖరిపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఏపీఎన్జీఓల ఉద్యమం రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా రహదారులను దిగ్బంధించారు. మరొక పక్క గురువారం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వేదిక పిలుపుమేరకు రాష్ర్ట బంద్‌ను జిల్లాలో విజయవంతం చేసేందుకు ఏపీ ఎన్జీఒలతో సహా అన్ని రాజకీయపార్టీలు సిద్ధమయ్యాయి. ఏపీ ఎన్జీఓల నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. కాగా బుధవారం నుంచి కార్పొరేషన్, మున్సిపల్, సహకార ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. గురువారం నుంచి ఎంపీడీఓలు మూడు రోజుల సామూహిక సెలవు ప్రకటించి ఉద్యమంలో పాల్గోనున్నారు.
ఏపీఎన్జీఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వివిధ శాఖల ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. కలెక్టరేట్ వద్ద చిదంబరం, జైరాంరమేష్‌ల ఫ్లెక్సీలను దహనం చేసి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలుచేశారు. అనంతరం కలెక్టర్‌ట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి ఇంద్రపాలెం వంతెనపై రాస్తారోకో చేశారు. దాంతో కాకినాడ -సామర్లకోటల మధ్య ట్రాఫిక్ నిలిచిపోయింది. రావులపాలెం వద్ద జాతీయరహదారి-16పై కళా వెంకట్రావ్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్భందించడంతోట్రాఫిక్‌నిలిచిపోయింది. రాజమండ్రి లాలాచెరువుసెంటర్‌లో జాతీయ రహదారిపై నగర అధ్యక్షుడు గెద్దాడ హరిబాబు ఆధ్వర్యంలో ఏపీఎన్జీఓలు రాస్తారోకో చేశారు. కోనసీమ జేఏసీ అధ్యక్షుడు వీఎస్ దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావు ఆధ్వర్యంలో అమలాపురం ఈదరపల్లి వంతెన వద్ద జాతీయ రహదారి-216పై ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
ఏలేశ్వరం బాలాజీచౌక్ సెంటర్‌లో వందలాది మంది విద్యార్థులు రాస్తారోకో చేశారు. రాజోలులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంక టేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో చేశారు. కాకినాడ, రాజమండ్రిలలో ఆర్టీసీ డీపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ఏపీ ఎన్జీఓల సమ్మెకు మద్దతుగా భోజన విరామ ప్రదర్శనలు నిర్వహించారు. కాకినాడ జీజీహెచ్‌తో పాటు రాజమండ్రి వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. రెండో రోజు కూడా ఆయా ఆస్పత్రి గేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాకినాడ జీజీహెచ్ శాఖ ఏపీజీడీఎ అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, కోశాధికారి డాక్టర్ లకో్ష్మజీనాయుడుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
బంద్‌ను విజయవంతం చేయండి
తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుండడాన్ని నిరసిస్తూ గురువారం తలపెట్టిన రాష్ర్ట బంద్‌ను విజయవంతం చేయాలని ఏపీ ఎన్జీఒ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం పిలుపు నిచ్చారు. వాణిజ్య వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement