ఆఖరి పోరాటం
Published Mon, Feb 10 2014 2:30 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
సాక్షి, కాకినాడ :తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే తరుణం సమీపిస్తుండడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏపీఎన్జీఓలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మిగిలిన ఉద్యోగ సంఘాలను సైతం సమ్మెలో భాగస్వాముల్ని చేస్తున్నారు. వైద్యులు కూడా సోమవారం నుంచి సమ్మెలోకి రానుండడంతో వైద్యసేవలు స్తంభించనున్నాయి. కాగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం 2కే రన్ నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీఒలు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. ఆదివారం జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలలో సమైక్య పరుగు నిర్వహించారు.
కాకినాడలో ఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌ల ఆధ్వర్యంలో ఈ పరుగును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, ఐడియల్ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవినికుమారి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి బాలాజీచెరువుసెంటర్ మీదుగా తిరిగి కలెక్టరేట్‌కు సాగిన ఈ పరుగులో ఉద్యోగులు, సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు అడ్డుకుని సమైక్యతను కాపాడాలని ఆశీర్వాదం కోరారు. బిల్లును అడ్డుకోని వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారు.
అమలాపురం గడియారస్తంభం సెంటర్ నుంచి నల్లవంతెన వద్ద గల తహశీల్దార్ కార్యాలయం వరకు సమైక్యాంధ్ర పరుగు నిర్వహించారు. పీఈటీ ల సంఘ జిల్లాఅధ్యక్షుడు శ్రీరామచంద్రమూర్తి సమైక్యాంధ్ర జ్యోతితో పరుగులో పాల్గొనగా, ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ దివాకర్, కోనసీమ జేఏసీ నాయకులు నక్కా చిట్టిబాబు నాయకత్వం వహించారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు సమైక్య పరుగు నిర్వహించారు. ఏపీ ఎన్జీఓ సంఘ నగరాధ్యక్షుడు గెద్దాడ హరిబాబు, మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి, సీమాంధ్ర న్యాయవాదుల కో కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి అమర్‌నాథ్ పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో నేతలు మాట్లాడుతూ తెలంగాణా బిల్లును అడ్డుకోనిసమైక్యాంధ్ర ద్రోహుల భరతం పడతామని హెచ్చరించారు.
జీజీహెచ్‌లో నేటి నుంచి వైద్యసేవలు బంద్
సోమవారం నుంచి ప్రభుత్వ వైద్యులు కూడా సమ్మె బాట పట్టనున్నారు. దీంతో కాకినాడ జీజీహెచ్‌లో అత్యవసర మినహా వైద్యసేవలను నిలిపి వేస్తున్నట్టు జీజీహెచ్ వైద్యుల సంఘ అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. రాజమండ్రి ఆస్పత్రిలో కూడా వైద్యసేవలు స్తంభించనున్నా యి. సోమ, మంగళవారాల్లో పెన్‌డౌన్ చేస్తామని, బుధవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని మున్సిపల్ ఉద్యోగులు ప్రకటించారు. పారిశుధ్య కార్మికుల సమ్మెతో ఇప్పటికే ఊళ్లలో చెత్త పేరుకుపోయింది. ఉద్యోగులు కూడా ఉద్యమబాట పట్టనుండడంతో పౌరసేవలు స్తంభించనున్నాయి. సహకార, ప్రభుత్వ బీమా ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు కూడా సోమవారం నుంచి సమ్మె చేపట్టనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నట్టు ఏపీఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బి.ఆశీర్వాదం వెల్లడించారు. సోమవారం ప్రారం భమయ్యే డిపార్‌టమెంటల్ పరీక్షలకూ హాజరుకావద్దని ఉద్యోగులకు పి లుపునిచ్చారు. మొత్తమ్మీద జిల్లాలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చనుంది.
మహిళా బిల్లు గతే పడుతుంది : మాజీ ఎంపీ శ్రీహరిరావు
సాక్షి, రాజమండ్రి : మహిళా బిల్లుకు పట్టిన గతే విభజన బిల్లుకూ పడుతుందని మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు అన్నారు. రాజమండ్రిలో ఆదివారం సాయంత్రం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణపై సీడబ్ల్యుసీ నిర్ణయం ప్రకటించినప్పుడే సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసి, సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇస్తే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజ్యసభలో దొడ్డిదారిన ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు భావిస్తున్న విభజన బిల్లుకు మహిళా బిల్లు గతే పడుతుందని, పదేళ్లైనా కదలిక ఉండదన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు గతంలో ప్రకటించిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా ఇది కొత్త పార్టీలపై చర్చించాల్సిన సమయం కాదని దాటవేశారు.
Advertisement
Advertisement