విభజన బిల్లును అడ్డుకోవాలి
Published Thu, Feb 13 2014 1:48 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
రాష్ట్ర విభజనను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల వారూ ఆందోళనలు చేస్తూ ఉద్యమానికి అండగా నిలబడుతున్నారు. ఏపీఎన్‌జీఓ పిలుపు మేరకు సమైక్యవాదులు బుధవారం జాతీయ రహదారులను దిగ్బంధించారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న పాలకులను క్షమించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఆర్థికంగా బాగా వెనుకబడే ప్రమాదముందని ఉద్యోగులు, న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్‌జీఓలు ఆరు రోజులుగా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఏడు గంటలకు స్థానిక వై జంక్షన్‌లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అలాగే జేఎన్‌టీయూ జంక్షన్‌లో కూడా రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్జీఓ అసోషియేషన్ నాయకుడు కొట్నాన శ్రీనివాసరావు మాట్లాడుతూ, విభజన బిల్లును అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల మనోభావాలకు భిన్నంగా కేంద్రం వ్యవహరించటం దుర్మార్గమన్నారు. అన్ని పార్టీలూ తమ అజెండాలను పక్కన పెట్టి సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రను పరిరక్షించుకునేంత వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్‌జీఓ నాయకులు సురేష్, రత్నం, ఈశ్వరరావు. తదితరులు పాల్గొన్నారు.
రంగప్రవేశం చేసిన పోలీసులు..
వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాస్తారోకోను విరమించుకోవాలని కోరారు. దీంతో సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన విరమించారు.
విద్యార్థుల సైకిల్ ర్యాలీ
బొబ్బిలి :రాష్ట్ర విభజన ప్రక్రియ ను నిలిపివేయాలని కోరుతూ బొబ్బిలిలో విద్యార్థులు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఏపీఎన్‌జీఓ నాయకుల పిలుపుమేరకు విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక వేణుగోపాలస్వామి దేవాలయం జంక్షన్‌వద్ద ప్రారంభమైన ర్యాలీ కోట జంక్షన్, తాండ్రపాపారాయ జంక్ష న్, పాత బస్టాండ్, గాంధీ బొమ్మ జంక్షన్‌ల మీదుగా రాష్ట్ర రహదారి వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా సమైక్యవాదులందరూ వాహన రాకపోకలను అడ్డుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ తిరుమలరావు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎన్‌జీఓ సంఘ చైర్మన్ చందాన మహందాతనాయుడు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు రౌతు రామూర్తి, సురేష్, జీవీఎస్‌ఆర్ మూర్తి, శంకరరావు, శ్వేతాచలపతి, శ్రీ చైతన్య, అభ్యుదయ, నారాయణ, భాష్యం, చైతన్య విద్యానికేతన్, ఐరిస్, తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలు సోనియాకి తొత్తులు
విజయనగరం టౌన్ :సీమాంధ్ర ప్రాంత నాయకులు సోనియాగాంధీకి తొత్తులుగా మారారని వైఎస్సార్‌సీపీ నాయకులు అవనాపు విక్రమ్, కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణసమితి ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, జిల్లాలో శాంతియుతంగా ఉద్యమాలు చేసిన అమాయకులపై అక్రమ కేసులు బనాయించిన ఘనత కాంగ్రెస్ నాయకులకే చెల్లిందన్నారు. విభజన విషయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవరిస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతార న్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మజ్జి త్రినాథరావు,చందక శ్రీను, పొట్నూరు శ్రీను, గండికోట శాంతి, నామాల సర్వేశ్వరరావు, మొయిద ఆదిబాబు, బుగత ముత్యాలమ్మ, క్రిస్టోఫర్ రాజు, వ ంకర గురుమూర్తి, పడగల శ్రీను, సతీష్‌రెడ్డి, ఇప్పిలి రామారావు , తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాన్ని బలపరచాలి
విజయనగరం మున్సిపాలిటీ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు పిలుపునిచ్చారు. ఉద్యమానికి మద్దతుగా స్థానిక అంబటి సత్రం జంక్షన్ వద్ద వాహనాలకు స్టిక్కర్లు అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు ఉద్యమం చేయడం మానేసి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎన్ రాజు, వీవీ ప్రసాద్, బలివాడ అప్పారావు, ప్రసాదుల రామకృష్ణ, సైలాడ త్రినాథ్, మైలపల్లి పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement