పాలకొండ:పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లు తయారైంది అధికారుల పరిస్థితి. ‘రుణమాఫీ జాబితాలు ఆన్‌లైన్‌లో పెట్టేశాం. బ్యాంకులకు ఆదేశిలిచ్చేశాం. ఇక మీరు సదస్సులు పెట్టి రుణ ఉపశమన పత్రాలు ఇచ్చేయండి’ అని ప్రభుత్వం ఆదేశించి చేతులు దులుపుకొంది. అయితే జాబితాలు ఇంకా పూర్తిస్థాయిలో అందక.. అందినవాటిలో అర్హులైన రైతుల పేర్లు గల్లంతైన పరిస్థితుల్లో సదస్సులు ఎలా నిర్వహించాలో.. ఆగ్రహంతో ఉన్న రైతులను ఎలా అనునయించాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గురువారం నుంచే సదస్సులు నిర్వహించాల్సి ఉండటంతో బుధవారం మండలస్థాయిలో సమావేశాలు పెట్టుకొని తర్జనభర్జనలు పడ్డారు. ఇప్పటికే తీరిక లేని షెడ్యుల్‌తో సతమతం అవుతుంటే.. సదస్సులు పెట్టమనడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో సదస్సుల పేరుతో గ్రామాల్లోకి వెళితే ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రైతు సాధికార సదస్సుల్లో ప్రధానంగా రుణమాఫీ జాబితాలు ప్రకటించడం, కొత్త పింఛన్లు పంపిణీ చేయడం, హుద్‌హుద్ తుపాను పరిహరం పంపిణీతో పాటు, స్వచ్ఛ భారత్ కార్యక్రామాలు చేపట్టాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అయితే రుణమాఫీపై నెలకొన్న గందరగోళం, చాలామంది రైతుల పేర్లు జాబితాల్లో లేని పరిస్థితుల్లో గ్రామాల్లోకి వెళ్ళి పరిహారం, రుణమాఫీలపై ప్రచారం చేయడం కష్టతరమని అధికారులు బావిస్తున్నారు. ఇప్పటికీ వివరాలు పూర్తి రాకపోవడం, అందుబాటులో ఉన్న వివరాల్లో చాలా తప్పుల వల్ల అర్హుల పేర్లు కనిపించక ఆగ్రహం, అసంతృప్తితో బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కనీసం 40 శాతం మంది పేర్లు కూడా రుణమాఫీ జాబితాలో లేవని, పైగా ప్రభుత్వం బ్యాంకులకు వెళ్లమని చెప్పడాన్ని బ్యాంకర్లు తప్పుపడుతున్నారు.
రైతులకు ఇదే విషయం చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తుపాను పరిహారంపైనా అధికారులకు ఇంత వరకు ఆదేశాలు లేవు. దీనిపై ఏం చెప్పాలన్న స్పష్టత లేదని పలువురు అధికారులు చెబుతున్నారు. పింఛన్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామాల్లో వందలాదిమంది అర్హులపై వేటు పడింది. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లోకి వెళితే ఆయా పథకాల బాధితుల ఆగ్రహానికి గురికాకతప్పదని అధికారులు భయపడుతున్నారు. రుణమాఫీ, పింఛన్లు తదితర అంశాల్లో రోజుకో ప్రకటనతో ప్రభుత్వం అనవసర హడావుడి చేస్తుండటం వల్లే ప్రస్తుత గందరగోళానికి దారితీసిందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండో శనివారం, ఆదివారాలు కూడా విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. దీనికి తోడు ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్‌లు, సెట్ కాన్ఫరెన్స్‌లతో రాత్రి 10 గంటల వరకు కార్యాలయాలకు అంకితం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సదస్సుల పేరుతో గ్రామాల్లోకి వెళ్లమంటూ తమకు వ్యక్తిగత జీవితం లేకుండా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఎలా వెళ్లాలి.. ఏం చెప్పాలి?!
Published Thu, Dec 11 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement
Advertisement