సాక్షి, అమరావతి: గత నాలుగేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమనంలోకి జారుకుంటున్నా రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతో సాధించామంటూ తప్పుడు గణాంకాలతో సీఎం చంద్రబాబు చేస్తున్న గిమ్మిక్కులు తీరని నష్టం కలిగించేలా పరిణమిస్తున్నాయి. ఒకపక్క విద్యారంగం పరిస్థితి దయనీయంగా ఉన్నా నంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించుకోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు చేజారుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాఠశాల విద్యకు సంబంధించి విద్యార్థుల ప్రమాణాలపై నిర్వహించిన రెండు సర్వేల్లో పరస్పర విరుద్ధంగా ఫలితాలు రావటం గమనార్హం.
విద్యారంగం నిధులకు భారీగా కోత
విద్యాశాఖకు సంబంధించి సర్వశిక్ష అభియాన్ ద్వారా గతంలో రూ. 2,600 కోట్ల నుంచి రూ.2,800 కోట్ల వరకు కేంద్రం నుంచి నిధులు అందేవి. తాజాగా ఇవి సగానికి తగ్గిపోయాయి. రూ.1,700 కోట్లయినా ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం రూ.1,200 కోట్లకు కుదించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ)కి విద్యా ఉపకరణాలు, విద్యా దర్శిని తదితరాల కోసం గతంలో ఏటా రూ.7 కోట్లు ఇస్తుండగా తాజాగా ఈ నిధులను కేంద్రం రూ.15 లక్షలకే పరిమితం చేసింది. జాతీయ వృద్ధి రేటు దాదాపు 7 % ఉండగా చంద్రబాబు ఏపీ గ్రోత్ రేటు ఏకంగా 11% వరకు ఉన్నట్లు చూపిస్తున్నారు. దేశంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నందున ఏపీకి ఇక ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులతో పనేముంటుందని ఇటీవల నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు వ్యాఖ్యానించడానికి సర్కారు ప్రచార ఆర్భాటమే కారణమనే విమర్శిస్తున్నారు.
వచ్చే ఏడాది ఫస్ట్ ర్యాంక్ మనదే: సీఎం
పాఠశాల విద్యలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉన్నట్లు ‘నేషనల్ అఛీవ్‌మెంట్ సర్వే’ (నేస్) – 2017 చెబుతున్న గణాంకాలు ఉత్త డొల్లేనని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘ప్రథమ్’ రూపొందించిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) స్పష్టం చేస్తోంది. నేస్ గణాంకాల ప్రకారం విద్యలో దేశవ్యాప్తంగా మూడోస్థానంలో ఉన్నామని, వచ్చే ఏడాది ప్రథమ స్థానానికి చేరుకుంటామని సీఎం చెబుతుండటం గమనార్హం. అయితే నేస్ గత నివేదికల్లో వెనుకబడి ఉన్న రాష్ట్రం హఠాత్తుగా ముందజంలో ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
‘నేస్’ పరీక్షల్లో వక్రమార్గం: ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించిన నేషనల్ అఛీవ్‌మెంట్ సర్వే (నేస్) గణాంకాలకు, స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ రూపొందించిన ‘అసర్’ నివేదికకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఏ స్కూల్‌లో ఈ పరీక్షలు జరుగుతాయి? ఎవరెవరితో రాయించాలి? అనేది పాఠశాల విద్యాశాఖే చూస్తుంది. ఎన్‌సీఈఆర్‌టీ హిందీలో పంపే ప్రశ్నపత్రాన్ని తెలుగులో తర్జుమా చేయిస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకొని నేస్ పరీక్షల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకొనేందుకు ప్రశ్నపత్రాలకు అనుగుణంగా విద్యార్థులను ముందే సిద్ధంచేశారనే విమర్శలున్నాయి.
అసర్ ప్రకారం..
3వ తరగతి
- 8.1 శాతం మంది తెలుగు అక్షరాలనూ గుర్తించలేకపోతున్నారు.
- 16.8% మంది అక్షరాలు చదవగలుగుతున్నా పదాలు చెప్పలేరు.
- 22.8 శాతం మంది ఒకటో తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నా రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నారు.
- 2.8శాతం మంది 9 వరకు ఉన్న అంకెలను గుర్తించలేకపోతున్నారు.
- 41.5% మంది రెండంకెల తీసివేతలు చేయగలుగుతున్నా విభాగాలను చేయలేకపోతున్నారు.
- 6.6% మంది మాత్రమే విభాగించడం చేయగలుగుతున్నారు.
5వ తరగతి
- 4.5% మంది తెలుగు అక్షరాలను చదవలేరు.
- 7.3 శాతం మంది అక్షరాలు గుర్తిస్తున్నా పదాలు చదవలేకపోతున్నారు.
- 55.1 శాతం మంది మాత్రమే రెండో తరగతి పుస్తుకాన్ని చదవగలుగుతున్నారు.
- 21.6 శాతం మంది ఒకటో తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నా రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నారు.
- 2.7 శాతం మంది 9వరకు ఉన్న అంకెలను గుర్తించలేకపోతున్నారు.
- 37.2% మందే విభాగించడం చేస్తున్నారు.
- 31.7% మంది తీసివేతలు చేస్తున్న విభజించడం చేయలేకపోతున్నారు.
8వ తరగతి
- 1.6 శాతం మంది అక్షరాలు కూడా చదవలేకపోతున్నారు.
- 2.4 శాతం మంది అక్షరాలు చదువుతున్నా పదాలు చెప్పలేకపోతున్నారు.
- 4.3 శాతం మంది ఒకటో తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నా రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నారు.
- 77.8 శాతం మంది మాత్రమే రెండో తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నారు.
- 1.0 శాతం మంది 9వరకు ఉన్న అంకెల్ని గుర్తించలేకపోతున్నారు.
- 31.3 శాతం మంది తీసివేతలు చేస్తున్నా విభజించడం రాదు.
- 50.4% మందే విభాగించడం చేయగలరు.
టెన్త్‌లోనూ నేస్ ఫలితాలూ అంతే..
ఎన్‌సీఈఆర్‌టీ ఫిబ్రవరిలో టెన్త్ విద్యార్ధులకు నిర్వహించిన ‘నేస్’ పరీక్షా ఫలితాలను పూర్తిగా ప్రకటించలేదు. ప్రాథమిక వివరాల ప్రకారం ఏపీ విద్యార్థులు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ఒక సమావేశంలో ప్రకటించారు. అయితే వాస్తవ ప్రమాణాలు, నేస్ గణాంకాలకు ఎంతో వ్యత్యాసం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నేస్‌లో ఏపీ సగటు స్కోర్ గతంలో 46% ఉండగా 2017లో ఏకంగా 65 శాతానికి పెరిగి దేశంలోనే మూడో స్థానానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment