
కోతలు లేని రాష్ట్రంగా ఏపీ
మంత్రి గంటా శ్రీనివాసరావు
జిల్లా విద్యుత్ కమిటీ తొలి సమావేశం
దీన్‌దయాళ్ పథకం తెలియదన్న ఎమ్మెల్యే పీలా
మహారాణిపేట (విశాఖ): రాష్ట్రాన్ని విద్యుత్‌కోతలు లేనివిధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయతంతో ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. నగరంలో విద్యుత్ కోతలపై ఆయన ఆరా తీశారు. కలెక్టరేట్‌లో గురువారం డిస్ట్రిక్ట్ ఎలక్ట్రిసిటీ కమిటీ (డీఈసీ)తొలి సమావేశం కమిటీ ఛైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. మంత్రి గంటా విద్యుత్ కోతల గురించి ప్రస్తావిస్తూ అంతరాయం ఏర్పడినప్పుడు వాడే జనరేటర్లకు ఎంత డీజిల్ ఖర్చువుతుందనేది బేరేజి వేసుకుని చెప్పాలన్నారు. ఇదే సందర్భంలో జిల్లాలో కొత్తగా 14 సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ సత్యనారాయణ మూర్తి చెప్పారు. దీనికి 118కోట్లు రూపాయిలు విడుదలయ్యాయన్నారు. విద్యుత్ సరఫరా, కొరత, దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకం, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీం గురించి ఎస్‌ఈ సత్యనారాయణ మూర్తి వివరించారు. సోలార్ సిస్టం ద్వారా నర్సీపట్నంలో 21, పాడేరులో 36 ఇళ్లు పని చేస్తున్నాయన్నారు. 183 మంది దరఖాస్తు చేసుకున్నారని ఇందులో 140 పూర్తి చేశామన్నారు. 467మంది రైతులు 5హెచ్‌పి/3హెచ్‌పి సామర్ద్యం గల సోలార్ పంప్‌సెట్లు కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఇందులో ఇద్దరు 3 హెచ్‌పి పంస్‌సెట్లుకు, మిగిలిన 114మంది 5హెచ్‌పి పంప్‌సెట్లుకు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు.
అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యన్నారాయణ జోక్యం చేసుకొని దీన్‌దయాళ్ ఉపాద్యాయ గ్రామజ్యోతి యోజన పథకం గురించి మాకుగాని , రైతులకు గాని తెలియదన్నారు. వీటికోసం జిల్లాలో రైతులనుంచి 660 దరఖాస్తులు వచ్చాయని ఇంతవరకూ ఒక్క రైతుకు కూడా పంప్‌సెట్ ఇవ్వలేదన్నారు. ఎంపీ కె. హరిబాబు మాట్లాడుతూ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికే కాకుండా ప్రస్తుతం మోటార్‌లున్న వారికి కూడా ఈ పథకం వర్తింపచేయాలన్నదే ఈ స్కీం ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి జోక్యం చేసుకొని పంప్‌సెట్లు ఉన్నవారికి పథకం వర్తించదన్నారు. దీనికి నెడ్‌క్యాప్ డీఎం రామరాజు స్పందిస్తూ కొత్తవారికే సోలార్ పంప్‌సెట్లు ఇస్తున్నామన్నారు. 4లక్షల90వేలు విలువైన ఈ పంప్‌సెట్‌కు రైతులు 55వేలు చెల్లించాలని మిగతాది నెడ్‌క్యాప్, ఏపీఈపీడీసీఎల్ భరిస్తుందన్నారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేశ్‌కుమార్, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.