బిల్లులు చెల్లించలేదనే సాకుతో కరెంటు కోత
వైఎస్ హయాంలో చిన్న పంచాయతీలకు మినహాయింపు
బిల్లులు చెల్లించాల్సిందేనంటూ చంద్రబాబు సర్కారు హుకుం
గ్రామాల్లో అంధకారంతో జనం అవస్థలు
గుడ్లవల్లేరు : జిల్లాలో పచ్చని పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయి. పంచాయతీ, ట్రాన్స్‌కో అధికారుల సమన్వయ లోపం పల్లె ప్రజలకు శాపంగా మారింది. బకాయిలు చెల్లించలేదనే పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో గ్రామీణులు చిమ్మచీకట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పంట చేలలో పైరు ఎదిగే సమయం కావటంతో చేలల్లో నుంచి పాములు, విష పురుగులు ఇళ్లలోకి చొరబడతాయేమోనని జనం భయం గుప్పెట్లో కాలం గడుపుతున్నారు. 30 రోజులుగా పల్లెల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీల్లో 820 మైనర్, 150 మేజర్ పంచాయతీలున్నాయి. పాత బకాయిలు చెల్లించలేదంటూ 690 చిన్న పంచాయతీలకు ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రస్తుత సర్పంచులకు పూర్వం వాడిన బిల్లుల్ని కూడా ప్రభుత్వం అంటగడుతోంది. అసలే మైనర్ పంచాయతీలు.. ఆదాయం అంతంతమాత్రం.. అయినా పాత బకాయిలు సహా లక్షలాది బిల్లులు చెల్లించాలని ఆదేశిస్తుండటంతో ఈ బిల్లుల్ని ఎలా చెల్లించాలని సర్పంచులు, కార్యదర్శులు ఆందోళనకు గురవుతున్నారు. టాన్స్‌కో అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. 13వ ఆర్థిక సంఘ నిధుల నుంచి నెలవారీ 10 శాతం చొప్పున బకాయిలు చెల్లించాలని చెబుతున్నారు. పాత పాలకవర్గాలు పెండింగ్‌లో ఉంచిన బిల్లుల్ని తాము ఎందుకు చెల్లిస్తామని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్ హయాంలో...
మైనర్ పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండటంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మంచినీటి సరఫరా, వీధిలైట్లకు వినియోగిస్తున్న విద్యుత్‌కు ఎలాంటి బిల్లులూ లేకుండా ఉచితంగా అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు చెల్లించవలసిందేనని హుకుం జారీ చేయడంతో పల్లెలు చీకట్లో మగ్గాల్సి వస్తోంది.
జిల్లాలో రూ.30 కోట్ల బకాయిలు
జిల్లాలో పంచాయతీల నుంచి రూ.30 కోట్ల బకాయిలు రావలసి ఉందని ట్రాన్స్‌కో జిల్లా ఎస్‌ఈ విజయకుమార్ తెలిపారు. గత నెలాఖరున రూ.50 లక్షల వరకు కొన్ని పంచాయతీలు 13, 14వ ఆర్థిక సంఘాల నిధుల నుంచి కొంతమేరకు చెల్లించటంతో వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
వెంటనే చర్యలు తీసుకుంటాం
13, 14వ ఆర్థిక సంఘ నిధుల్లో 20 శాతం చొప్పున కరెంట్ బిల్లుల చెల్లింపునకు వినియోగించాలని సూచించినట్లు డీపీవో డి.కృష్ణకుమారి చెప్పారు. ఇంకా చెల్లించని పంచాయతీలు ఉన్నట్టు తన దృష్టికి రాలేదన్నారు. చర్యలు తీసుకుంటామన్నారు.
పల్లెల్లో చీ‘కట్’లు
Published Thu, Nov 5 2015 12:59 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement