వడ్డీ సహా లక్షన్నరే మాఫీ!
రుణమాఫీపై చంద్రబాబు విధాన ప్రకటన
రెండు దశలుగా మాఫీ ప్రక్రియ
50 వేల లోపుంటేనే ఒకేసారి, ఆ పైన ఎంతున్నా ఐదేళ్లలో మాఫీ
శాస్త్రీయ పద్ధతిలో రైతుల ఖాతాల వడపోత
తొలి విడత జాబితా రేపు విడుదల
22.79 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి
ఇంకా తేలని కౌలు రైతుల లెక్క
10వ తేదీ నుంచి బ్యాంకులకు నగదు బదిలీ
రెండో విడత జాబితాపై ఈ నెల 9 నుంచి కసరత్తు
అప్పుడు కూడా ధ్రువపత్రాలు ఇవ్వకుంటే చేయగలిగిందేమీ లేదన్న సీఎం
డ్వాక్రా సంఘాలు మరికొంత కాలం ఆగాల్సిందేనని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విధాన ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రకటించిన లక్షన్నర రూపాయల మాఫీలో వడ్డీ కూడా కలిసి ఉందని స్పష్టం చేశారు. తొలిదశలో రుణమాఫీకి అర్హమైన 40.43 లక్షల ఖాతాలను గుర్తించినట్లు తెలిపారు. 22.79 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చుతున్నట్టు ప్రకటించారు. మిగిలిన 42.23 లక్షల ఖాతాలను పరిశీలించి ఎంతమంది అర్హులో త్వరలో ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. రూ.50 వేల లోపు రుణాలను ఒకేదఫాలో మాఫీ చేస్తామని, మిగతా వాటిని ఐదేళ్లలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా రుణాలు చెల్లించేసిన వారందరికీ మాఫీ వర్తించకుండా మెలిక పెట్టారు.
గతేడాది డిసెంబర్ 31 వరకు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ పరిధిలోకి తీసుకున్నామంటూ.. డిసెంబర్ చివరివరకు చెల్లించకుండా, ఆ తర్వాత (జనవరి నుంచి ఏప్రిల్ వరకు) చెల్లించి ఉంటే వారికి మాత్రమే మాఫీ వర్తింపజేసి నగదు తిరిగి చెల్లిస్తామన్నారు. డ్వాక్రా, చేనేత సంఘాలు రుణమాఫీకి మరికొంత కాలం ఆగాలని ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఈ విధానం ఏమి చెబుతున్నదంటే...
రుణమాఫీ రెండు దశల్లో జరుగుతుంది. తొలి విడత జాబితా ఈ నెల 6వ తేదీన విడుదలవుతుంది. రూ.50 వేల లోపు రుణాలున్న వారికి తొలిదశలో ఒకేసారి మాఫీ జరుగుతుంది. రూ.50 వేలకు పైన ఎంతున్నా 20 శాతం చొప్పున ఐదేళ్లలో ప్రభుత్వం చెల్లిస్తుంది. తొలి విడత 20 శాతం మొత్తాన్ని ఈ నెల 9న చెల్లిస్తారు. ఈ నెల 10వ తేదీ నుంచి బ్యాంకులకు నగదు సర్దుబాటు ప్రారంభమవుతుంది. రెండో విడత జాబితా తయారీ ప్రక్రియ ఈ నెల 9న ప్రారంభమై వచ్చే నెల 8న ముగుస్తుంది. నగదు బదిలీ సహా ఈ ప్రక్రియ అంతా వచ్చే జనవరి 22లోగా ముగుస్తుంది. ఈ వ్యవహారంలో ఏవైనా అనుమానాలుంటే తీర్చడానికి ఓ విభాగం, కాల్‌సెంటర్ ఏర్పాటవుతుంది. తొలి విడతలో ఎంతమంది కౌలు రైతులు లబ్ధిపొందారో ఇంకా లెక్క తేలలేదు. రుణ అర్హత పత్రాలుండి బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందని సీఎం చెప్పారు.
మళ్లీ పేరు మారిందా!..
చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. ఇది చారిత్రాత్మకమైన రోజు. రుణ ఉపశమన పథకాన్ని అమలు చేస్తున్నాం. (ముందు రుణమాఫీ, ఆ తర్వాత రుణ విముక్తి, ఇప్పుడు రుణ ఉపశమనం) కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రైతుల కష్టాలు చూసి చలించిపోయా. రుణమాఫీ హామీ ఇచ్చా. రాష్ట్రం రెండుగా చీలినా, రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా మాటకు కట్టుబడ్డా. తొలి సంతకం పెట్టానంటూ చెప్పుకొచ్చారు. శాస్త్రీయ పద్ధతిలో ఖాతాలను వడపోశామన్నారు. ‘తొలి జాబితా తయారు చేశాం. వాళ్లందరి ఖాతాలకు ఇప్పుడు నగదు బదిలీ చేస్తున్నాం. ఈ జాబితాలో లేని వారికి 4 వారాల గడువిచ్చి ఆధార్, రేషన్ కార్డులు ఇమ్మని అడుగుతాం. వచ్చిన వాటిని పరిశీలించి తుది జాబితా తయారు చేసి వారి ఖాతాలకు నగదు బదిలీ చేస్తాం..’ అని వివరించారు. ఉద్యానవన రైతులకు కూడా ఎకరానికి పది వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
రైతులకు లేఖలు...
‘ఈనెల పది నుంచి రుణ విముక్తి మొదలవుతుంది. రైతు సాధికార సంస్థకు బదలాయించిన రూ.5 వేల కోట్ల నుంచి నిధులు బ్యాంకులకు జమ అవుతాయి. ఈ మేరకు రైతులందరికీ లేఖలు ఇస్తాం. బ్యాంకుల వాళ్లు ఇక వాళ్ల వద్దకు వెళ్లకూడదు. రూ.50 వేల పైన అప్పుంటే వాళ్లకు 20 శాతం చెల్లిస్తూ లేఖలు ఇస్తాం. మిగతా నాలుగేళ్లకూ వడ్డీని కడతాం. ఈ మేరకు రైతులకు విధాన (పాలసీ) పత్రాలు ఇస్తాం. 10 నుంచి ఒక వారం పాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో జన్మభూమి గ్రామ సభలు నిర్వహించి రుణ విముక్తిపై అవగాహన కల్పిస్తాం. రెండో విడత జాబితాలు ప్రకటించి ధ్రువపత్రాలు కోరతాం.
అప్పుడు కూడా ఇవ్వకపోతే చేయగలిగిందేమీ లేదు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32,04,295 వ్యవసాయ కుటుంబాలున్నాయి. వీటిలో 22.79 లక్షల కుటుంబాలకు రుణ విముక్తి కల్పిస్తున్నాం. రైతుల పరంగా చూస్తే ఆ సంఖ్య 26.77 లక్షలుగా ఉంటుంది. జనవరి 22 లోపల రుణమాఫీని పూర్తి చేస్తాం..’ అని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు. పేరు ప్రస్తావించకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శించారు.ి రుణమాఫీ విధివిధానాలపై జీవో
సీఎం గురువారం చేసిన రుణమాఫీ విధాన ప్రకటనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రక్రియ సాగిందిలా..
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సమాచారాన్ని సేకరించారు
ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఖాతాల సమాచారాన్ని పరిశీలించారు.
అనంతరం బ్యాంకులు, గ్రామ జన్మభూమి కమిటీలతో (వీజేసీలు) తనిఖీలు
తొలి విడత జాబితా ఖరారు, నిధుల విడుదలకు కసరత్తు
మిగిలిపోయిన ఖాతాదారుల గుర్తింపు రెండో దశలో
4 వారాల గడువు, ఒక వారం పాటు అధికారులు, జేఏసీల తనిఖీలు
అర్హమైనవి ఉంటే ఆ తర్వాత చెల్లింపులు
విధివిధానాలు ఇలా...
రుణమాఫీకి పరిగణనలోకి తీసుకున్న పత్రాలు: ఆధార్, రేషన్ కార్డులు (రేషన్‌కార్డు లేకుంటే ఓటరు గుర్తింపు కార్డు)
రుణమాఫీ కాలం: 2007 ఏప్రిల్ 1 నుంచి 2013 డిసెంబర్ 31 వరకు
పంట రుణాలు, అనుబంధ రుణాలకు మాత్రమే వర్తింపు
ఈ పథకం కింద ఉన్న పంటకు మాత్రమే అర్హత
చెల్లుబాటయ్యే భూమి పత్రం ఉండాలి
ఒకే సర్వే నంబర్ భూమిపై యజమాని, కౌలురైతు ఇద్దరూ రుణం తీసుకుని ఉంటే కౌల్దారుకు ప్రాధాన్యత
ఒకే కుటుంబంలో ఒకరికి మించి రుణం తీసుకుని ఉంటే రద్దయ్యే లక్షన్నర రూపాయల మొత్తం దామాషా (ప్రొరేటా) ప్రాతిపదికన పంపిణీ
వివిధ రకాల రుణాలున్నప్పుడు పంట రుణానికి తొలి ప్రాధాన్యత. ఆ తర్వాతి స్థానం- మార్చుకున్న పంట రుణానికి, ఆ తర్వాత బంగారు రుణానికి..
ఒకే రైతు వివిధ బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని ఉంటే పట్టాదారు పాస్ పుస్తకం ఎక్కడ తాకట్టు పెట్టారో ఆ బ్యాంకుకు ప్రాధాన్యత
రూ.50 వేల లోపు రుణాలకు పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) వర్తించదు. ఈ తరహా రుణాలన్నీ పూర్తిగా రద్దవుతాయి.
రూ.50 వేల పైన ఉన్న రుణాలకు ఇప్పుడు 20 శాతం, మిగతా 80 శాతాన్ని 20 శాతం చొప్పున నాలుగు విడతలుగా చెల్లిస్తారు.
అత్యధికంగా రద్దయ్యే మొత్తానికి లోబడి ఉద్యానవన రైతులకు ఎకరానికి పది వేల రూపాయల సాయాన్ని అందిస్తారు.
బాబు చెప్పిన ప్రకారం ఖాతాలు
బ్యాంకుల్లో నమోదైన ఖాతాలు: 82.66 లక్షలు
తొలిదశ రుణమాఫీకి గుర్తించిన ఖాతాలు: 40.43 లక్షలు
గుర్తించిన రైతుల సంఖ్య: 26.77 లక్షలు
గుర్తించిన కుటుంబాలు: 22.79 లక్షలు
రెండోదశలో పరిశీలించే ఖాతాలు:
42.23 లక్షలు
మాఫీ షెడ్యూల్ ఇదీ
తొలిదశ జాబితా ప్రకటన:ఈ నెల 6న
బ్యాంకులకు నగదు సర్దుబాటు ప్రారంభం: ఈనెల 10 నుంచి
రెండో దశలో ఖాతాలకు నగదు సర్దుబాటు:జనవరి 17 నుంచి 22 మధ్య
సమస్యల పరిష్కార విభాగం ప్రారంభం: డిసెంబర్ 9 నుంచి