వ్యవసాయ రుణాలంటే పంట రుణాలే
చంద్రబాబు అదే అర్థంలో చెప్పారు: పరకాల భాష్యం
ప్రతిపక్ష నేత జగన్‌కు స్పష్టత లేకపోవడం వల్లే ఆరోపణలు
ఈ నెల 10వ తేదీ లోగా 71 శాతం మంది రైతులకు రుణ విముక్తి
శనివారం రాత్రికి అర్హులైన రైతుల జాబితా ఆన్‌లైన్‌లో పెడతాం
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల పరిభాషలో.. సెరీకల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, గొర్రెల పెంపకం, ట్రాక్టర్లు, టిల్లర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు ఇచ్చిన అన్ని రకాల రుణాలను వ్యవసాయ రుణాలుగా పేర్కొంటారని.. అయితే చంద్రబాబు మాత్రం పంట రుణాలనే అర్థంలో మాత్రమే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల హామీల్లో చెప్పారని.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీకి కూడా ఇదే అర్థమని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ సరికొత్త భాష్యం చెప్పారు.
బాబు వ్యవసాయ రుణాలని చెప్పినా ప్రజలు పంట రుణాలనే అర్థం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పరకాల శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లని, దీనికి ఆధారంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) నివేదికను ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘అదే నివేదికలో ఏడో పేరాలో అన్ని రకాల వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లు ఉంటుంది. కానీ 10వ పేరా వరకు ప్రతిపక్ష నేత ఓపిగ్గా చదివితే వ్యవసాయ రుణాలు రూ. 49,774 కోట్లు కూడా కనిపించేది. ప్రతిపక్ష నేతకు సరైన సమాచారం లేక పొరపడ్డారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రైతు కుటుంబాలు 32 లక్షలే...
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతు కుటుంబాలు 32 లక్షలే ఉన్నాయని పరకాల పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు మీరు (పరకాల ప్రభాకర్) టీడీపీతో లేరు కాబట్టి.. వ్యవసాయ రుణాలు, పంట రుణాలకు తేడా తెలియక, స్పష్టత లేకపోవడం వల్ల పంట రుణాలనే వ్యవసాయ రుణాలని బాబు పొరబడ్డారని మీరు భావిస్తున్నారా?’’ అని విలేకరులు అడిగినప్పుడు..ఆయనకు చాలా స్పష్టత ఉందని, వ్యవసాయ రుణాలంటే పంట రుణాలేనని ప్రజలూ అర్థం చేసుకున్నారని ఆయన సమాధానం చెప్పారు.
తొలి దశలో 22.79 లక్షల (71 శాతం) మంది రైతులను రుణాల నుంచి విముక్తి చేయనున్నామని, ఈ నెల 10 లోగా వారి బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తామని పరకాల చెప్పారు. శనివారం రాత్రికి రుణ విముక్తికి అర్హులైన రైతుల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచుతామని తెలిపారు. 22.79 లక్షల మంది రైతులకు ఉపశమనం కల్పించడానికి చెల్లిస్తున్న రుణాల మొత్తం ఎంత అనే విషయం మీద విలేకరులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినా.. ఆయన సమాధానం చెప్పలేదు. ‘‘మీరు ప్రశ్నలు అడుగుతున్నట్లుగా లేదు. నన్ను పరీక్షిస్తున్నట్లుగా ఉంది’’ అని ఆయన ఒక దశలో అభ్యంతరం చెప్పారు. మరో 45 రోజుల్లో రెండో దశ రుణ విముక్తి కూడా పూర్తి చేస్తామని పరకాల పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించాం...
రుణమాఫీకి సంబంధించి జారీ చేసిన జీఓలో 2014 మార్చి వరకు తీసుకున్న రుణాలను చెల్లిస్తామని ఉందని, కానీ తీరా అమలు చేస్తున్న సమయంలో 2013 డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలనే చెల్లిస్తున్నారని, ఇది మాట తప్పడం కాదా? అని విలేకరులు ప్రశ్నించినప్పుడు.. రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించామనీ అంటే అన్ని సార్లు మాట తప్పినట్లా? అని ప్రశ్నించారు.