
'చినబాబుకు సూట్‌కేస్, బిగ్‌బాస్‌కు బ్రీఫ్‌కేస్'
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మహావీర వాగ్దాన భంగ’ బిరుదు ప్రదానం చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు.
ఆనందపేట (గుంటూరు): ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మహావీర వాగ్దాన భంగ’ బిరుదు ప్రదానం చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. ఆదివారమిక్కడ జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలనపై అదిరిందయ్యా చంద్రం - బెదిరిందయ్యా ఆంధ్రం’ అనే వాస్తవ పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రఘవీరా మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్‌లను అటకెక్కించి మద్యం దుకాణాలను తెరవాలని నిర్ణయించడం దారుణమన్నారు. ఉచిత విద్యా పథకాన్ని ఎత్తేసిన చంద్రబాబు.. తన కొలువులోని మంత్రులు, శాసనసభ్యుల కళాశాలల్లో మాత్రం ఫీజులు పెంచుకునేందుకు అనుమతించారు.’ అని ఆరోపించారు.
రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీ, టీడీపీలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చినబాస్‌కు సూట్‌కేస్, బిగ్‌బాస్‌కు బ్రీఫ్‌కేస్’ అందనిదే ఏ పని జరగదని ఆరోపించారు. చంద్రబాబులో నిజాయితీ, పౌరుషం ఉంటే జూన్ 8 నాటికి ఏడాది పాలనపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు పద్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు షేక్ మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.