సాక్షి, ఢిల్లీ: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీని కలిసిన అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడుతూ..' ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను రాహుల్‌కు వివరించాను. పోలవరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రాహుల్ దృష్టికి తీసుకెళ్లా. విభజన హామీల అమలులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోకసభలో రూల్ 184 కింద విభజన హామీల అంశాలపై నోటీసులు ఇవ్వాలని రాహుల్ ని కోరాము. ఇదే అంశంపై పార్లమెంట్‌లో ఓటింగ్‌కు పట్టుబడతామని ఆయన హామీ ఇచ్చారు.
విభజన హామీలు గాలికొదిలేసి అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించారు. అసెంబ్లీ సీట్ల పెంపుకు మేము వ్యతిరేకం కాదు కానీ ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేరిస్తేనే పార్లమెంటులో సీట్ల పెంపు ప్రతిపాదనకు సహకరిస్తాము. రెండు రాష్ట్రాలకు విభజన హామీల అమలుకు మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం. ప్రాధాన్యత అంశాలు వదిలేసి అసెంబ్లీ సీట్లపై దృష్టి సారించడాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తోంది. విభజన హామీలన్నీ రెండు రాష్ట్రాలకు అమలుపరచాలి. రాష్ట్రానికి సంబందించి అంశాల వారీగా కాంగ్రెస్ పోరాడుతుంది. రాహుల్ గాంధీ కూడా ఏపీ సమస్యలపై పోరాడతామని హామీ ఇచ్చారు' అని రఘువీరా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment