ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాము స్పష్టంగా చెప్పినా, అప్పుడు పార్లమెంటులో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినా దురదృష్టవశాత్తు ఎన్డీయే ప్రభుత్వానికి మాత్రం ఆ ఉద్దేశం లేనట్లుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం తాము సేకరించిన కోటి సంతకాలున్న పత్రాలను తీసుకుని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు అందజేసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఆంధ్రాలో పెద్ద మార్పు జరిగిందని, ఆ సందర్భంగా తాము ఆంధ్రా ప్రజలకు మద్దతుగా ఉంటామని చెప్పామని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్పష్టం చేశామని, ఏపీ ఒక మార్పు దిశగా వెళ్తోంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వాళ్లకు అన్నివిధాలా సాయం చేయాలన్నామని తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదని ఆయన మండిపడ్డారు. తాను పలు సందర్భాల్లో ఏపీ వచ్చానని, ప్రత్యేక హోదా కోసం పోరాడానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా పోరాటాన్ని లీడ్ చేస్తోందని, మీ ప్రయత్నానికి అభినందనలంటూ సోనియాగాంధీ నేతలను ప్రశంసించారు. ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల సేకరణ చేసినందుకు ఏపీ కాంగ్రెస్‌ను ఆమె అభినందించారు. విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణాలకు తాము కట్టుబడి ఉన్నామని, ఈ అంశాల మీద కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. బీజేపీ సర్కారు వీటిని అమలు చేయడం లేదని, బీజేపీ-టీడీపీలు ఏపీ ప్రజల కోరికను నెరవేర్చడం లేదని ఆమె అన్నారు. రైతులు ఏపీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డబ్బులు ఇవ్వకుండా రాజధానికి భూములు తీసుకున్నారని ఆమె చెప్పారు. రాజధాని శంకుస్థాపన సభలో ప్రధాని మోదీ ఏపీకి న్యాయం చేసే ప్రకటన చేస్తారనుకుంటే... కేవలం నీళ్లు, మట్టి మాత్రమే ఇచ్చారని అన్నారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని, పార్లమెంట్ లో కాంగ్రెస్ మద్దతు ఏపీకి ఉంటుందని ఆమె అన్నారు. సాధిద్దాం.. సాధిద్దాం.. ప్రత్యేక హోదా సాధిద్దాం అనే నినాదంతో ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.