'ప్రత్యేక హోదా కోసం 12న ఛలో ఢిల్లీ'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో గురువారం ఆయన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ....ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడం లేదన్నారు.
ప్రత్యేకహోదా కోసం చేసిన సంతకాల సేకరణ ఉద్యమంపై రాహుల్తో చర్చించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలసి 'ప్రత్యేకహోదా కోసం ఛలో ఢిల్లీ' పోస్టర్ను విడుదల చేశారు. ఈ నెల 12న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీలను కలసి సంతకాల వివరాలను అందిస్తామని రఘువీరా పేర్కొన్నారు. సోనియా, రాహుల్ను కలిసిన వారిలో కేవీపీ, జైరాం రమేష్, సుబ్బరామిరెడ్డి తదితరులు ఉన్నారు.