
సాక్షి, అమరావతి: బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు నిమిత్తం 2009లో కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిల్లకూరు, కోట మండలాల్లో వేల ఎకరాల భూములు కేటాయించామని, ఆ సంస్థ ఆ భూములను తాకట్టుపెట్టి రూ.1,935 కోట్ల మేర రుణం తీసుకుని వ్యక్తిగత అవసరాలకు వాడుకుందని ఏపీఐఐసీ హైకోర్టుకు నివేదించింది. పదేళ్ల క్రితం భూములు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంది.
సెజ్ కింద భూములు పొందిన శ్రీసిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, అక్కడ వేల మంది ఉపాధి పొందుతున్నారని వివరించింది. కాని 4,731 ఎకరాల భూములు పొందిన కేఐపీఎల్ మాత్రం, ఐదంతస్తుల భవనం తప్ప ఏమీ కట్టనందున భూ కేటాయింపులను రద్దు చేశామని తెలిపింది. భూ కేటాయింపుల రద్దును సవాల్ చేస్తూ కేఐపీఎల్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వారం రోజుల పాటు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశం మేరకు ఏపీఐఐసీ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. అక్టోబర్ 25న ఇచ్చిన యథాతథస్థితి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోర్టును అభ్యర్దించింది.