సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ ఎన్‌జీవోలు గురువారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ అండగా నిలవడంతో విభజన నిరసనలు మిన్నంటాయి. ఎన్‌జీవోల బంద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు త మ సంఘీభావాన్ని ప్రకటించాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిరసనలు కొన్ని ప్రాంతాలకే పరిమితంకాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాల్లో ఆందోళనలకు దిగింది. జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్‌జీవోలు బస్టాండ్‌కు వెళ్లి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు.
వైఎస్‌ఆర్‌సీపీ ర్యాలీకి ఆ పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ నాయకత్వం వహించారు. ఎన్‌జీవోలకు సంఘీభావంగా మునిసిపల్ కార్మికులు కూడా ర్యాలీ చేపట్టారు. నగరంలో మధ్యాహ్నం వరకు దుకాణాలు మూతబడ్డాయి. పాఠశాలలు, కార్యాలయాలు పూర్తిగా తెరుచుకోలేదు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు యోగయ్యయాదవ్ నాయకత్వంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చర్చి సెంటర్ వద్ద ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను రెవెన్యూ సిబ్బంది దహనం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో విద్యార్థులతో కలిసి ఎన్‌జీవోలు భారీ ర్యాలీ చేపట్టారు.
అనంతరం మానవహారంగా ఏర్పడి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. చీరాలలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పదిమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ నాయకులు కలిసి బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు.
ఆ తర్వాత యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు. దర్శిలో బస్సులు ఆపి.. ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. గిద్దలూరులో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి స్వామి రంగారెడ్డి నాయకత్వంలో నంద్యాల-ఒంగోలు రోడ్డుపై ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షడు డాక్టర్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. అనంతరం అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. కందుకూరులో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ బిల్లు ప్రతులను తగులబెట్టారు. విద్యార్థులతో కలిసి ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కొండపి నియోజకవర్గం పరిధిలోని టంగుటూరులో పార్టీ మండల కన్వీనర్ బొట్ల రామారావు నాయకత్వంలో ర్యాలీ నిర్వహించి యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కనిగిరిలో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు. ఉదయం నుంచి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను మూ యించారు. ఎన్‌జీవోలతో కలిసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. పర్చూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యాలయాలు, దుకాణాలు మూయించి.. ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులప్పాడులో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అమృతపాణి నాయకత్వంలో ధర్నా, ర్యాలీలు నిర్వహించారు. యర్రగొండపాలెంలోనూ నిరసనలు మిన్నంటాయి.
ఊరుకోం
Published Fri, Feb 14 2014 3:08 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement