- పుచ్చిపోయిన 150 ఏళ్లనాటి స్తంభం
- కొత్తది ఏర్పాటుకు మీన మేషాలు
- టేకు మాను, రాగితాపడం ఎప్పుడో సిద్ధం
- అధికార, వైదిక వర్గాల తాత్సారం
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం మార్చే పనులపై సింహాచల దేవస్థానం అధికార, వైదిక వర్గాలు తాత్సారం చేస్తున్నాయి. ధ్వజస్తం భాన్ని గడిచిన ఉత్తరాయణంలో మార్పు చేస్తామని ప్రకటించిన అధికార, వైదిక వర్గాలు ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్లి, మరో ఉత్తరాయణం సమీపిస్తున్నా ఆ విషయంపై దృష్టి సారించటం లేదు.
వివరాల్లోకి వెళ్తే.... రాష్ర్టంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రస్తుత ధ్వజస్తంభం సుమారు 150 ఏళ్ల క్రింతం ప్రతిష్టితమైంది. అది ప్రస్తుతం ఒకైవె పునకు వంగి ఉండటం, లోపల ఉన్న చెక్క పుచ్చిపోవడం వంటి పరిస్థితుల దృష్ట్యా నాలుగేళ్ల కిందటే కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
2011లో అప్పటి ఈవో ప్రేమ్‌కుమార్ హయాంలో విశాఖ జిల్లా లంబసింగి అడవుల నుంచి 72 అడుగుల పొడవైన భారీ టేకు మానును తీసుకొచ్చారు. ఇంతలోనే ఆ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ కోర్టు కేసు, టీటీడీతో కుదుర్చుకున్న ఒప్పందం తెరపైకి రావడంతో కొంతకాలం ఆ పనులు నిలిచిపోయాయి. తరువాత ఏడాది క్రితం ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో 2014 సంవత్సరం ఉత్తరాయణంలో కొత్త ధ్వజస్తంభం ప్రతిష్టిస్తామని వైదిక, అధికారులు ప్రకటించారు.
ధ్వజస్తంభానికి అవ సరమైన రాగి తాపడాన్ని కూడా 2013 జూన్ నెలలో సిద్ధం చేశారు. మళ్లీ ఉత్తరాయణం సమీపిస్తున్నా ఆ పనులే జరగలేదు. ఇప్పటికే మూడున్నర ఏళ్ల నుంచి భారీ టేకు మాను ఎండకి ఎండి, వానకు తడుస్తోంది. రాగి తాపడం మూలన పడి ఉంది. రానున్న ఉత్తరాయణంలోనైనా నూతన ద్వజస్తంభం ప్రతిష్ట జరగాలని భక్తులు, ఇటు అడవివరం గ్రామస్తులు కోరుతున్నారు.