ఇంతకూ ఏ పరీక్ష రాయాలి? | APPSC Screening Test, LIC AAO Exam Same Day | Sakshi
Sakshi News home page

ఇంతకూ ఏ పరీక్ష రాయాలి?

Published Tue, Apr 23 2019 9:55 AM | Last Updated on Tue, Apr 23 2019 1:03 PM

APPSC Screening Test, LIC AAO Exam Same Day - Sakshi

సాక్షి, గుంటూరు: ఒకే రోజున రెండు పోటీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో నిరుద్యోగులు సంకట స్థితిలో చిక్కుకున్నారు. ప్రస్తుతం గ్రూప్‌–2 అభ్యర్థులు ఇదే విషయంపై తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. 446 గ్రూప్‌–2 పోస్టులకు వచ్చే నెల 5న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనుంది. ఈ పోస్టులకు మొత్తం మూడు లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అదే రోజున ఎల్‌ఐసీ ఏఏఓ (గ్రాడ్యుయేట్‌ లెవల్‌) పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్‌–2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ రాయబోతున్నవారిలో చాలామంది ఎల్‌ఐసీ ఏఏఓ పరీక్షకు కూడా దరఖాస్తు చేశారు. దీంతో రెండింటిలో ఏ పరీక్షకు హాజరుకావాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా వీఆర్‌ఏలు, వీవోఏలు, కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం గ్రూప్‌–2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెలవులు లభించక గ్రూప్‌–2 పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారు. దీంతో వాళ్లంతా పరీక్షలు వాయిదా వేయాలని లేకుంటే అవకాశం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని ఏపీపీఎస్సీ

రెండు పరీక్షలను ఒకే రోజు నిర్వహిస్తుండటం వల్ల తాము నష్టపోతాం కాబట్టి గ్రూప్‌–2 పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు పలుమార్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా కూడా చేశారు. అయితే ప్రభుత్వం పట్టించుకోలేదు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నియామక పరీక్షలు ఉన్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ నియామక పరీక్షలను వాయిదా వేయడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఆనవాయితీని తుంగలో తొక్కి అన్యాయం చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో సైతం కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ నియామక పరీక్షలు నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఈస్టర్‌ పండుగ నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరినా ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. ఇదే తరహాలో గ్రూప్‌–2 పరీక్షను సైతం నిర్వహిస్తే గ్రూప్‌–2, ఎల్‌ఐసీలో ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సి ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.  

పరీక్ష వాయిదా వేయాలి
గ్రూప్‌–2, ఎల్‌ఐసీ ఏఏఓ పోస్టులకు దరఖాస్తు చేశా. ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటంతో ఏ పరీక్షకు హాజరవ్వాలో తెలియడం లేదు. రూ.లక్షలు ఖర్చుపెట్టి ప్రభుత్వ నోటిఫికేషన్‌ల కోసం ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. ఈ తరుణంలో రెండు పరీక్షలను ఒకే రోజు నిర్వహించడం సమంజసం కాదు. ప్రభుత్వం గ్రూప్‌–2 పరీక్షను వాయిదా వేసి మాకు న్యాయం చేయాలి.
– వెంకట్, గ్రూప్‌–2, ఎల్‌ఐసీ ఏఏఓ అభ్యర్థి, గుంటూరు

ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి..
ప్రభుత్వం, ఏపీపీఎస్సీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్టు పరీక్షలు నిర్వహిస్తూ లక్షలాదిమంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. మే 5న ఎల్‌ఐసీ, గ్రూప్‌–2 పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్‌–2ను వాయిదా వేయాలి. లేదంటే నిరుద్యోగులు ఉద్యోగావకాశాలను కోల్పోతారు.
– సమయం హేమంత్‌ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement